కాంగ్రెస్ ఎమ్మెల్యే కుమారుడు తుపాకీతో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన మధ్యప్రదేశ్‌లో చోటుచేసుకుంది. కాంగ్రెస్ ఎమ్మెల్యే సంజయ్ యాదవ్ కుమారుడు వైభవ్ యాదవ్ (17) గురువారం సాయంత్రం సూసైడ్ నోట్ రాసి ఈ ఘటనకు పాల్పడ్డాడు. జబల్‌పూర్‌లోని గోరఖ్‌పూర్ ప్రాంతంలో ఉన్న ఎమ్మెల్యే నివాసంలో బాత్‌రూంలో తలపై తుపాకీతో కాల్చుకుని వైభవ్ చనిపోయాడు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. సూసైడ్ నోట్‌లో తన ఆత్మహత్యకు ఎవరూ కారణం కాదని వైభవ్ పేర్కొన్నట్లు పోలీసులు వెల్లడించారు.
Read Also: టీ20 ప్రపంచకప్: ఈసారి కొత్త ఛాంపియన్ షురూ
అయితే ఆత్మహత్య చేసుకోవడానికి ముందు వైభవ్ తన స్నేహితులకు మెసేజ్ పెట్టాడని పోలీసులు తెలిపారు. ప్రస్తుతం వైభవ్ ఓ ప్రైవేట్ కాలేజీలో ఇంటర్ చదువుతున్నాడు. తీవ్రమైన ఒత్తిడి, మానసిక సమస్యల కారణంగానే వైభవ్ చనిపోయి ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు. కాగా వైభవ్ తండ్రి సంజయ్ యాదవ్ 2018 ఎన్నికల్లో బర్గి నియోజకవర్గం నుంచి విజయం సాధించారు. ఆయనకు ఇద్దరు కుమారులు ఉండగా.. ఆత్మహత్యకు పాల్పడ్డ వైభవ్ చిన్న కుమారుడు.