IND vs AUS: విశాఖ వేదికగా టీమిండియా ఆసీస్‌తో ఆసక్తికర పోరుకు సిద్ధమైంది. ఆదివారం జరిగే రెండో వన్డేలో ఆసీస్‌తో భారత్ అమీతుమీ తేల్చుకోనుంది. మొదటి వన్డేలో అతికష్టం మీద విజయం సాధించిన టీమిండియా.. రెండో వన్డేలో రాణించాలని చూస్తోంది. కుటుంబ కారణాల వల్ల తొలి వన్డేకు దూరమైన కెప్టెన్ రోహిత్ శర్మ విశాఖ మ్యాచ్‌కు అందుబాటులోకి రానున్నాడు. ఇది టీమిండియాకు బలంగా మారనుంది. కానీ లెక్క సరిచేయాలని పట్టుదలగా ఉన్న ఆసీస్‌ను ఓడించడం అంత తేలికేమీ కాదు. ఇదిలా ఉండగా.. రెండో వన్డేకు వరుణుడి అడ్డంకి తప్పేలా లేదు. నగరంలో ఆదివారం ఉదయం నుంచి భారీ వర్షం కురుస్తోంది. మ్యాచ్‌కు వర్షం ముప్పు ఉండటం వల్ల క్రికెట్ అభిమానులు తీవ్ర నిరాశలో ఉన్నారు. శుక్ర, శనివారం కురిసిన వర్షాలతో మ్యాచ్ జరగనున్న ఏసీఏ-వీడీసీఏ మైదానాన్ని పూర్తిగా కవర్లతో కప్పి ఉంచారు. ఆదివారం ఉదయం కూడా ఉరుములు, మెరుపులతో వర్షం కురుస్తోంది. దీంతో రెండో వన్డే మ్యాచ్ నిర్వహణపై సందేహాలు నెలకొన్నాయి.
ముంబయిలోని వాంఖడే స్టేడియం వేదికగా జరిగిన తొలి వన్డేలో భారత్ ఐదు వికెట్ల తేడాతో విజయం సాధించిన సంగతి తెలిసిందే. కానీ తొలి వన్డేలో టాపార్డర్ వైఫల్యం భారత్‌కు షాక్ ఇచ్చింది. ఫామ్‌లో ఉన్న కోహ్లి, శుభ్‌మన్, సూర్యకుమార్ యాదవ్ వాంఖడేలో తేలిపోయారు. ఇషాన్ కిషన్ అవకాశాన్ని ఉపయోగించుకోలేకపోయాడు. తాత్కాలిక కెప్టెన్ హార్దిక్ పాండ్య కూడా నిరాశ పరిచాడు. కేఎల్ రాహుల్, రవీంద్ర జడేజా నిలకడగా ఆడడంతో టీమిండియా మ్యాచ్‌లో నెగ్గింది. టీ20, టెస్టుల్లో వరుసగా విఫలమవుతూ జట్టులో చోటు కూడా కోల్పోయిన కేఎల్ రాహుల్.. వన్డేల్లో మాత్రం తన క్లాస్ గేమ్‌ను చూపించాడు.
Read Also: TIME Magazine Best Places : ప్రపంచంలోని గొప్ప ప్రదేశాల జాబితాలో మయూర్‌భంజ్, లడఖ్
మ్యాచ్ కోసం భారత్, ఆస్ట్రేలియా జట్ల క్రీడాకారులు శనివారం సాయంత్రమే విశాఖ విమానాశ్రయానికి చేరుకున్నారు. విశాఖలోని స్టేడియంలో భారత్-ఆసీస్ మధ్య రెండో వన్డే మధ్యాహ్నం 1.30గంటలకు ప్రారంభం కానుంది. వర్షం కారణంగా ఇరు జట్లు ప్రాక్టీస్‌కు రాలేదు. ఆదివారం కావడంతో ప్రత్యక్షంగా మ్యాచ్ చూసేందుకు చాలా మంది టికెట్లు కొనుగోలు చేశారు. మరోవైపు సెలవు రోజు కావడంతో టీవీల్లో మ్యాచ్ చూసేందుకు సిద్ధమయ్యారు. ఈ నేపథ్యంలో వరుణుడు ఈ మ్యాచ్‌ను సజావుగా సాగనిస్తాడా? లేదా? అనే సందేహంతో క్రికెట్ అభిమానుల్లో నిరాశ నెలకొంది.
భారత్ జట్టు: రోహిత్ (కెప్టెన్), గిల్, కోహ్లి, సూర్యకుమార్, హార్దిక్, రాహుల్ (వికెట్ కీపర్), జడేజా, శార్దూల్/ ఉమ్రాన్, కుల్దీప్, సిరాజ్, షమి
ఆస్ట్రేలియా జట్టు: స్మిత్ (కెప్టెన్), హెడ్/వార్నర్, మార్ష్, లబుషేన్, ఇంగ్లిస్ (వికెట్ కీపర్), గ్రీన్, మ్యాక్స్‌వెల్, స్టాయినిస్, అబాట్, స్టార్క్, జంపా