Local Boy Nani: విశాఖపట్నం ఫిషింగ్ హార్బర్‌లో అగ్నిప్రమాదం ఘటనలో మరో కొత్త ట్విస్ట్ వచ్చి చేరింది.. అగ్నిప్రమాదం, బోట్లు తగలబడిపోయిన ఘటనలో పోలీసులు అనుమానితుడిగా భావించిన యూట్యూబర్, లోకల్‌బాయ్ నాని.. హైకోర్టు మెట్లు ఎక్కారు. విశాఖ ఫిషింగ్ హార్బర్ లో బోట్లు కాలిపోయిన ఘటనలో పోలీసులు తనను మూడు రోజుల పాటు అక్రమంగా నిర్బంధించారంటూ హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేశారు నాని.. అయితే, ఈ పిటిషన్‌పై విచారణను వచ్చే సోమవారానికి వాయిదా వేసింది ఏపీ హైకోర్టు.
Read Also: Heavy Rainfall: కేరళ, తమిళనాడులో భారీ వర్షం.. స్కూల్స్ మూసివేయాలని ఆదేశాలు
కాగా, విశాఖ ఫిషింగ్ హార్బర్ లో అగ్ని ప్రమాద ఘటనలో యూట్యూబర్ లోకల్ బాయ్ నానిని అదుపులోకి తీసుకున్న విశాఖ వన్ టౌన్ పోలీసులు.. అగ్నిప్రమాదంపై ఆరా తీశారు.. ఈ అగ్నిప్రమాదానికి నానియే కారణం అంటూ జోరుగా ప్రచారం జరిగింది. దీంతో, అతడిని మూడు రోజుల పాటు పోలీసుల అదుపులోనే ఉన్నాడు.. అయితే, నానిని అక్రమంగా పోలీసులు బంధించారని అతని స్నేహితులు హైకోర్టులో పిటిషన్ వేశారు. ఆ తర్వాత పోలీసులు నానిని రిలీజ్ చేశారు.. అయితే, తనపై తప్పుడు ప్రచారం చేశారని మండిపడుతున్నాడు నాని. దీంతో.. హైకోర్టును ఆశ్రయించాడు.. తనను అక్రమంగా నిర్బంధించారని పిటిషన్ దాఖలు చేయడంతో.. విశాఖ పోలీసులు చిక్కుల్లో పడినట్టు అయ్యింది.
అయితే, ఈ నెల 19వ తేదీన అర్ధరాత్రి ఫిషింగ్ హర్బర్‌లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో 49 బోట్లు తగలబడిపోయాయి.. ఇప్పటికే బోట్ల యజమానులకు పరిహారం పంపిణీ చేసింది ప్రభుత్వం.. 49 బోట్లకు రూ.7.11 కోట్ల ప్రత్యేక ఆర్థిక సహాయాన్ని ఏపీ సీఎం వైఎస్ జగన్ ప్రకటించడం.. ఆ తర్వాత మత్స్యకారులకు మంత్రులు సీదిరి అప్పలరాజు, గుడివాడ అమర్నాథ్.. తదితర నేతలు వెళ్లి ఆ పరిహారాన్ని బాధితులకు అందజేసిన విషయం విదితమే.