YCP MP Resigns: వైసీపీకి మరో నేత గుడ్‌బై చెప్పారు. కర్నూలు ఎంపీ పదవికి, వైసీపీ ప్రాథమిక సభ్యత్వానికి డా.సంజీవ్‌కుమార్ రాజీనామా చేశారు.
ఎంపీ టికెట్ లేదని తేలడంతో ఎంపీ సంజీవ్ కుమార్ రాజీనామాకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. కర్నూల్ ఎంపీ టికెట్‌ను మంత్రి జయరాంకు కేటాయిస్తారని ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే మనస్తాపం చెందిన సంజీవ్ కుమార్ రాజీనామా చేసినట్లు తెలుస్తోంది. ఎంపీ పదవికి రాజీనామా చేసిన ఆయన రెండు రోజుల్లో లోక్‌సభ స్పీకర్‌ను కలిసి రాజీనామా లేఖ సమర్పిస్తానని తెలిపారు. ఏ పార్టీలో చేరాలో ఇంకా ఏ నిర్ణయం తీసుకోలేదన్నారు. సీఎం జగన్‌ను కలవడానికి ఫోన్ చేస్తే రిసీవ్ చేసుకోలేదన్నారు. బీసీలకు పెద్దపీట వేస్తామంటారే కానీ.. అది చేతల్లో ఉండదని సంజీవ్ కుమార్ పేర్కొన్నారు.
Read Also: Daggubati Venkateshwara Rao: ఎన్నికల్లో టికెట్లు రాని వారు అదృష్టవంతులు.. మాజీ మంత్రి కీలక వ్యాఖ్యలు
కర్నూలు ఎంపీ సంజయ్‌కుమార్ మాట్లాడుతూ.. “వైసీపీలో కొనసాగలేను. ఎంపీగా ఉన్నప్పటికీ ప్రజా సమస్యలు పరిష్కరించలేని పరిస్థితి. జగన్‌ను కలిసేందుకు పదిసార్లు ప్రయత్నం చేసినా అవలేదు. పార్టీ విధానం సరిగా లేదు.పేదలకు కొంత వరకు పథకాల ద్వారా సాయం అందుతోంది. అభివృద్ది మాత్రం ఏం జరగటం లేదు. బీసీలకు పార్టీలో న్యాయం పరిపూర్ణంగా జరగటం లేదు. ఇంకా ఏ పార్టీ కూడా నన్ను సంప్రదించలేదు. స్వతంత్ర అభ్యర్థిగా కూడా పోటీ చేసే ఆప్షన్ నాకు ఉంది. నాకు టికెట్ రాదని నేను రాజీనామా చేశాననటం సరికాదు. ఐదేళ్లుగా నాలో అసంతృప్తి ఉంది. నా భవిష్యత్ కార్యాచరణ త్వరలోనే తెలుస్తుంది.” అని ఆయన వెల్లడించారు.