Daggubati Venkateshwara Rao: ఎన్నికలపై సీనియర్ రాజకీయ నేత, మాజీ మంత్రి దగ్గుబాటి వెంకటేశ్వరరావు కీలక వ్యాఖ్యలు చేశారు. డబ్బుంటేనే ఎన్నికలలో పోటీ చేయాలి అన్నట్లు వ్యవస్థ మారిపోయిందన్నారు. ప్రస్తుత రాజకీయాలు గౌరవప్రదంగా లేవన్నారు. రూ. 30, 40 కోట్లు ఖర్చు పెట్టి గెలిచినా పెట్టిన డబ్బులు సంపాదించేందుకు ఇప్పుడు అవకాశాలు లేవన్నారు. ఇంతకు ముందు పెట్టిన డబ్బులు సంపాదించేందుకు కొంత అవకాశం ఉండేదన్నారు. ఇప్పుడు కొత్త ట్రెండ్ నడుస్తోందని.. పార్టీ అధిపతి, ఎమ్మెల్యేలను ఎంపీలను ఉత్సవ విగ్రహాలుగా చేశారని వ్యాఖ్యానించారు. ఇసుక, మద్యం, మైనింగ్‌లలో లక్షల కోట్లను దోచుకుంటున్నారని.. భారతదేశంలో సింగిల్ మేన్ పార్టీలు మొత్తం ఇలాగే ఉన్నాయన్నారు.
Read Also: Andhrapradesh: మున్సిపల్ కార్మిక సంఘాలను మరోసారి చర్చలకు పిలిచిన ప్రభుత్వం
గతంలో ఎమ్మెల్యేలు ఊరికి మంచి సేవ చేసి గౌరవప్రదంగా ఉండేవారని.. ఇప్పుడా పరిస్థితి లేదన్నారు. గెలిచిన తర్వాత రాజకీయాలకు ఎందుకు వచ్చామా అని ఎమ్మెల్యేలు, ఎంపీలు తలబాదుకుంటున్నారన్నారు. రానున్న ఎన్నికల్లో ఎవరికైతే టికెట్లు రావో వారు అదృష్టవంతులంటూ ఆయన అన్నారు. ఎమ్మెల్యేగా పోటీ చేద్దామనుకుని టికెట్ రాకుంటే కనీసం వాళ్లకు 30 కోట్లు 40 కోట్లు మిగిలినట్టేనన్నారు. వాళ్ల జీవితంలో సంపాదించుకున్న డబ్బులను వృధాగా ఖర్చు పెట్టాల్సి వస్తుందన్నారు.ఇప్పుడు ఎమ్మెల్యేలు సంపాదించుకున్నది మొత్తం ఓ చోట ఖజానాకే చేరుతుందన్నారు. ఓడిన వాడు అక్కడే ఏడుస్తాడు.. గెలిచిన వాడు ఇంటికొచ్చి ఏడుస్తాడన్నారు. నిజమైన ప్రజాప్రతినిధులను భగవంతుడు కాపాడాలని కోరుకుంటున్నానన్నారు. రానున్న ఎన్నికలలో తాను, తన కుమారుడు హితేష్ పోటీ చేయడం లేదని ఇటీవల అందుకే మరోసారి చెప్పామన్నారు.