కులగణన సర్వేపై కేటీఆర్ వ్యాఖ్యలకు టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ కౌంటర్ ఇచ్చారు. తెలంగాణలో కులగణన సర్వే పాదర్శకంగా జరిగింది.. కేటీఆర్ ఎలాంటి ఆధారాలు లేకుండా బీసీ కులగణనను తప్పులు తడక అంటున్నారని దుయ్యబట్టారు. ఎంతో శాస్త్రీయంగా లక్షకు పైన సిబ్బందిని పెట్టి ఇళ్లిల్లు పరిశీలన చేసి గణన చేయడం జరిగిందని తెలిపారు. కులగణన దేశానికే ఆదర్శంగా చేపట్టాం.. కాంగ్రెస్ ప్రభుత్వానికి మంచి పేరు వస్తుంటే భరించలేక కేటీఆర్ ఏదేదో మాట్లాడుతున్నారని మండిపడ్డారు. రాహుల్ గాంధీ ఆదేశాలనుసారం కులగణన సర్వేను కాంగ్రెస్ ప్రభుత్వం సంకల్పంతో పూర్తి చేసిందని మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు. కులగణన సర్వేపై కేటీఆర్ వ్యాఖ్యలను బీసీ సమాజం క్షమించదని అన్నారు.
Read Also: Biren Singh: మణిపూర్ సీఎం పదవికి బీరెన్ సింగ్ రాజీనామా..
1931 తర్వాత కులగణన జరిగింది.. ఇది బీసీలకు ఎంతో మేలు జరుగుతుందని మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు. పక్కాగా పకడ్బందీగా కులగణనను దేశంలోనే మొదటిసారి చేసిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిదన్నారు. 2014లో సమగ్ర కుటుంబ సర్వే చేసి కనీసం ఆ లెక్కలను కూడా బయటకు చెప్పలేని అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం ఇప్పుడు మాట్లాడడం అవివేకమని పేర్కొన్నారు. బీసీలకు న్యాయం జరుగుతుంటే కేటీఆర్ భరించలేకపోతున్నారని తెలిపారు. కులగణన సర్వేలో పాల్గొనని కేటీఆర్.. ఆయన కుటుంబ సభ్యులు రీ-సర్వే గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉందని దుయ్యబట్టారు. బలహీనవర్గాల గురించి కేటీఆర్ మాట్లాడటం హస్యాస్పదం.. పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో బీసీలకు తీరని అన్యాయం జరిగిందని ఆరోపించారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్, బీజేపీ లోపాయికారి ఒప్పందం చేసుకుందని తెలిపారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయడానికి బీఆర్ఎస్ పార్టీకి అభ్యర్థులు కరువు అని ఆరోపించారు. పార్లమెంట్ ఎన్నికల్లో మాదిరిగానే ఎమ్మెల్సీ ఎన్నికల్లో పరోక్షంగా బీఆర్ఎస్ బీజేపీకి మద్దతిస్తుందని మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు.
Read Also: Thummala Nageswara Rao: కార్యకర్తలు కూడా అధికారాన్ని అనుభవించాలి.. పార్టీని బ్రతికించుకోవాలి