Biren Singh: రెండేళ్లుగా జాతుల ఘర్షణతో అట్టుడుకుతున్న మణిపూర్‌లో కీలక పరిణామం చోటు చేసుకుంది. మణిపూర్ సీఎం పదవికి బీరెన్ సింగ్ రాజీనామా చేశారు. రెండేళ్ల నుంచి మణిపూర్‌లో మెజారిటీ మైయిటీ, మైనారిటీ కుకీ వర్గం మధ్య ఘర్షణ తలెత్తింది. ఇప్పటికీ కూడా ఆ రాష్ట్రంలో ఉద్రిక్త పరిస్థితులే ఉన్నాయి. ఈ ఘర్షణలు ప్రారంభమైనప్పటి నుంచి సీఎం బీరెన్ సింగ్‌ని ప్రతిపక్షాలతో పాటు బీజేపీలోనే అసమ్మతి పెరిగింది. ఈ నేపథ్యంలోనే ఆయన రాజీనామా చేసినట్లు తెలుస్తోంది. ఆయన రాజీనామాను గవర్నర్‌కి అందించారు.
Read Also: Aligarh Muslim University: అలీఘర్ ముస్లిం యూనివర్సిటీలో ‘‘బీఫ్ బిర్యానీ’’ వివాదం..
మిత్రపక్షం కాన్రాడ్ సంగ్మాకు చెందిన నేషనల్ పీపుల్స్ పార్టీ మద్దతు ఉపసంహరించుకున్నప్పటికీ, బీజేపీకి సంఖ్యాబలం ఉంది. ఇదిలా ఉంటే, కాంగ్రెస్ బీరెన్ సింగ్‌పై అవిశ్వాస తీర్మానం పెట్టేందుకు సిద్ధమవుతోంది. ఒక వేళ ఇదే జరిగితే, పార్టీ విప్ ధిక్కరించి ఎమ్మెల్యేలు ఓటేసే అవకాశం ఉంది. దీనిని నివారించడానికి కేంద్ర నాయకత్వంలో చర్చించిన తర్వాత ముఖ్యమంత్రి రాజీనామా చేశారు.
బీరెన్ సింగ్ ఆదివారం ఉదయం ఢిల్లీకి వెళ్లి పార్టీ చీఫ్ జేపీ నడ్డా, కేంద్రమంత్రి అమిత్ షాని కలిశారు. దాదాపుగా 12 మంది ఎమ్మెల్యేలు నాయకత్వ మార్పు కోసం బలంగా ఒత్తిడి తీసుకువస్తున్నారు. ఆరుగురు ఎమ్మెల్యేలు వ్యతిరేకంగా ఓటేసే అవకాశం ఉందని తెలుస్తోంది. దీంతో పాటు స్పీకర్, సీఎం మధ్య కూడా విభేదాలు ఉన్నట్లు సంబంధిత వర్గాలు చెబుతున్నాయి.