KTR : కరీంనగర్ జిల్లాలో కేంద్రమంత్రి బండి సంజయ్ చేసిన దొంగనోట్ల ఆరోపణలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రంగా స్పందించారు. కేంద్రమంత్రిగా ఉన్న బండి సంజయ్ తాము దొంగనోట్లను ముద్రించారని ఆరోపించడం విచిత్రమని వ్యాఖ్యానించారు. బండి సంజయ్ ఆరోపణలపై స్పందించిన కేటీఆర్, “మీరు కేంద్రమంత్రిగా ఉండి మమ్మల్ని దొంగలు అంటారు. అయితే, అప్పుడు కర్ణాటకలో మీరే అధికారంలో ఉన్నారు కదా? దర్యాప్తు చేసి నిజాలు బయటపెట్టాల్సింది మీరే!” అని వ్యాఖ్యానించారు. నిరాధార ఆరోపణలు చేయడం బీజేపీ నేతలకు అలవాటైపోయిందని ఆరోపించారు.
దేశంలో జనాభా ప్రాతిపదికన నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ (డీలిమిటేషన్) చేపట్టకూడదన్నదే తమ పార్టీ యొక్క స్పష్టమైన డిమాండని కేటీఆర్ తెలిపారు. “దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతోంది. అందుకే, ఈ సమస్యను చర్చించేందుకు దక్షిణాది రాష్ట్రాల సదస్సుకు హాజరయ్యాం,” అని వివరించారు.
బీజేపీ అసలు ముసుగును తొలగించేందుకు, దక్షిణాది రాష్ట్రాలను ఏకతాటిపైకి తేవాలని తమ పార్టీ ప్రయత్నిస్తోందని కేటీఆర్ పేర్కొన్నారు. “పార్లమెంట్ కొత్త భవనంలో అన్ని సీట్లను లెక్క ప్రకారం ఏర్పాటు చేశారు. కానీ, అసలు సమస్య ఏమిటంటే, బీజేపీ ఉత్తరాదిలో, ముఖ్యంగా అస్సాం, జమ్ముకాశ్మీర్‌లో సీట్లు పెంచుతూనే ఉంది. అయితే, ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో ఎందుకు పెంచడం లేదు?” అని ప్రశ్నించారు.
దక్షిణాది రాష్ట్రాల హక్కుల పరిరక్షణ కోసం పోరాడటం రాజకీయాలకతీతంగా చూడాలని కేటీఆర్ పేర్కొన్నారు. “ఇక్కడ కాంగ్రెస్, బీఆర్ఎస్ అనే విషయమే కాదు. ముందుగా మనం భారతీయులం. దక్షిణాదికి జరుగుతున్న అన్యాయాన్ని తిప్పికొట్టాల్సిన అవసరం ఉంది,” అని ఆయన స్పష్టం చేశారు.
Municipal Chairman: అన్యాయంగా పదవి నుంచి తొలగించేందుకు కుట్ర.. మున్సిపల్ ఛైర్మన్ శాంత