Municipal Chairman: కర్నూలు జిల్లా ఆదోని పట్టణంలో మున్సిపల్ ఛైర్మన్ శాంత చేపట్టిన నిరసన దీక్ష నాల్గవ రోజుకు చేరింది. తనను అన్యాయంగా పదవి నుంచి తొలగించేందుకు కుట్ర జరుగుతోందని ఆమె ఆరోపించారు. ఈ నేపథ్యంలో వైసీపీ కౌన్సిలర్లపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. నేను చేసిన తప్పేంటో చూపించండి అంటూ వైసీపీ కౌన్సిలర్లకు ఛైర్మన్ శాంత సవాల్ విసిరారు. తనను తొలగించేందుకు కౌన్సిలర్లకు భారీగా డబ్బు ముట్టిందని ఆరోపించారు. ప్రతీ కౌన్సిలర్‌కు లక్షన్నర ఇచ్చారని, వైస్ చైర్మన్‌కు ఐదు లక్షలు ముట్టాయి అంటూ ఆమె సంచలన వ్యాఖ్యలు చేశారు.
Read Also: CSK vs MI : రెండూ పెద్ద టీంలు.. హోరా హోరీ పోరు.. గెలుపు ఎవరిది?
తనపై తీసుకుంటున్న నిర్ణయం న్యాయబద్ధమైనదే అయితే, డబ్బు తీసుకోలేదని నిరూపించుకునేందుకు ఊరుకుంద క్షేత్రంలో దీపం వెలిగించాలని కౌన్సిలర్లను ఛైర్మన్ శాంత కోరారు. మీరు డబ్బు తీసుకోలేదని నిజమే అయితే స్వామి సన్నిధిలో దీపం వెలిగించి ప్రమాణం చేయండి అంటూ ఆమె కౌన్సిలర్లను ప్రశ్నించారు. మున్సిపల్ ఛైర్మన్ శాంతకు మద్దతుగా వాల్మీకి సంఘాలు తమ పూర్తి మద్దతు ప్రకటించాయి. ఆమెను పదవి నుంచి తొలగించకుండా కొనసాగించాలనే డిమాండ్ చేస్తున్నాయి. వాల్మీకి సంఘాల నేతలు స్పందిస్తూ, ఛైర్మన్ శాంత సేవలను గుర్తించి, ఆమెను తన పదవిలో కొనసాగించాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ ఘటన ఆదోనిలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతం శాంత దీక్ష, ఆమె ఆరోపణలు, కౌన్సిలర్లు స్పందించే విధానం రాజకీయ వర్గాల్లో హాట్‌టాపిక్‌గా మారాయి.