తెలంగాణ రాజకీయం ఇప్పుడు మునుగోడు నియోజకవర్గం వైపు చూస్తోంది. ఇటీవల మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఇటు కాంగ్రెస్ పార్టీతో పాటు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. దీంతో మునుగోడులో ఉప ఎన్నిక రానుంది. అయితే.. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన రాజగోపాల్ రెడ్డి బీజేపీలో అమిత్ షా సమక్షంలో చేరారు. ఈ క్రమంలోనే మునుగోడు జెండా పాతేందుకు కాంగ్రెస్, టీఆర్‌ఎస్, బీజేపీ పార్టీలు ఇప్పటికే పాదయాత్రలు, సభలు నిర్వహిస్తున్నాయి. అయితే తాజాగా.. మాజీ ఎమ్మెల్యే, బీజేపీ నేత కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి నేడు యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్ నారాయణపురం మండల కేంద్రంలో ముఖ్య కార్యకర్తల సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతూ.. యావత్ దేశం మునుగోడు వైపే చూస్తుందన్నారు. టీఆర్ఎస్ పార్టీ లో చేరితెనే ఎమ్మెల్యేలకు కేసీఅర్ అపాయిట్మెంట్ ఇస్తాడు అంటూ ఆయన విమర్శించారు.
అంతేకాకుండా.. మునుగోడులో బీజేపీ గెలిస్తే, నెలరోజుల్లో టీఆర్ఎస్ ప్రభుత్వం పడిపోతదంటూ ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. నా ప్రాణం ఉన్నంత వరకు మునుగోడును వదిలిపెట్టనని, టీఆర్ఎస్ పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలకు వారి నియోజక వర్గ సమస్యల గురించి కేసీఅర్ ను అడిగే దమ్ముందా? అని ఆయన ప్రశ్నించారు. ఇంటికి కిలో బంగారం ఇచ్చిన టీఆర్ఎస్ కు ప్రజలు ఓటెయ్యరని, మునుగోడు ప్రజలు ఇచ్చే తీర్పు చరిత్రలో నిలిచిపోతుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.