మచిలీపట్నంలో అర్థరాత్రి నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. దొంగ పట్టాలు సిద్దం చేస్తున్నారని రెవెన్యూ సిబ్బందిని మాజీ మంత్రి కొల్లు రవీంద్ర పట్టుకున్నారు. అయితే.. అవి దొంగ పట్టాలు కాదని పెండింగ్ లో ఉన్న పట్టాలకు సంబంధించి వర్క్ చేస్తున్నామని రెవెన్యూ సిబ్బంది వెల్లడించారు. దీంతో.. కొల్లు రవీంద్ర సహా పలువురిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు ఎమ్మార్వో సతీష్. ఈ సందర్భంగా మాజీ మంత్రి కొల్లు రవీంద్ర మాట్లాడుతూ.. మరో 24 గంటల్లో ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కానున్న నేపథ్యంలో దొంగ పట్టాలతో అమాయక ప్రజలను మోసం చేస్తున్నారని అన్నారు. దొంగ పట్టాలపై డీటీ సంతకాలు పెడుతుండటాన్ని అడ్డుకున్నానని కొల్లు రవీంద్ర తెలిపారు. సుమారు వెయ్యి దొంగ పట్టాలను ఆర్ఐ యాకూబ్ తీసుకెళ్లి వైసీపీ కార్యకర్తల చేతుల్లో పెట్టారని కొల్లు రవీంద్ర ఆరోపించారు. తహశీల్దార్ కార్యాలయంలో జరిగిన దొంగ పట్టాల దందాపై కలెక్టర్, జాయింట్ కలెక్టర్ కి కొల్లు రవీంద్ర ఫిర్యాదు చేశారు. దొంగ పట్టాలపై ఇప్పటికే ఎలక్షన్ కమిషన్ కు కొల్లు రవీంద్ర ఫిర్యాదు చేశారు. ఎలక్షన్ కమిషన్ కు ఫిర్యాదు చేసినా స్థానిక రెవెన్యూ అధికారులు ఎమ్మెల్యే పేర్ని నానికి తొత్తుగా వ్యవహరిస్తున్నారని కొల్లు రవీంద్ర ధ్వజమెత్తారు.