Kishan Reddy: రాష్ట్రంలో భారీ వర్షాల నేపథ్యంలో బీజేపీ సభ్యత్వ కార్యక్రమం వాయిదా వేసుకున్నామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి తెలిపారు. దురదృష్టవశాత్తూ కొందరు ప్రాణాలు కోల్పోయారని.. రాష్ట్రంలో వర్ష పరిస్థితులపై మోడీ, అమిత్ షా రాష్ట్ర ముఖ్యమంత్రితో మాట్లాడారని వెల్లడించారు. కేంద్రం ఎన్డీఆర్‌ఎఫ్ బృందాలను పంపించిందన్నారు. కేంద్ర హోంసెక్రటరీ రాష్ర్ట ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో రెగ్యులర్‌గా టచ్‌లో ఉన్నారని చెప్పారు. అవసరం అయిన సహకారం అందిస్తున్నారని పేర్కొన్నారు. దెబ్బతిన్న జాతీయ రహదారులను వెంటనే మరమ్మతులు చేయాలని ప్రధాని కార్యాలయం ఆదేశించిందని కిషన్ రెడ్డి తెలిపారు. ఖమ్మం ప్రాంతంలో దెబ్బతిన్న రోడ్లు, రైల్వే ట్రాక్‌లు యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని కేంద్రం ఆదేశించిందన్నారు.
నివేదిక ఇస్తే కేంద్రం నిధులు ఇస్తుంది.. !
పార్టీ స్థానిక కార్యకర్తలు సహాయ కార్యక్రమాల్లో పాల్గొనాలని పిలుపునిచ్చామన్నారు. ఎక్కడ పొరపాటు జరిగిందో రాజకీయ విమర్శలు చేయకుండా సహాయక చర్యల్లో భాగస్వాములు కావాలని పార్టీకి ఆదేశించామన్నారు. స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫండ్‌లో కేంద్ర నిధులు ఉంటాయన్నారు. నిధులకు కొరత లేదని, వాటితో సహాయ కార్యక్రమాలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నామన్నారు. గతంలో ఖర్చు చేసిన నిధులపై ప్రభుత్వం యుటిలైజేషన్ సర్టిఫికెట్ సబ్మిట్ చేయలేదన్నారు. జూన్ 1న 208 కోట్లు రిలీజ్ అయ్యాయని.. అవి కేంద్రం దగ్గర ఉన్నాయన్నారు. 1328 కోట్ల ఎస్డీఆర్‌ఎఫ్ ఫండ్ రాష్ట్రం దగ్గర ఉన్నాయన్నారు. యుటిలైజేషన్ సర్టిఫికెట్(యూసీ) సబ్మిట్ చేస్తే రూ. 208 కోట్లు కూడా వస్తాయన్నారు. కేంద్ర బృందాలు పర్యటించి నష్టాన్ని అంచనా వేసి నివేదిక ఇస్తే కేంద్రం నిధులు ఇస్తుందని వెల్లడించారు.
Read Also: Manjira River: ఏడుపాయల ఆలయం వద్ద మంజీరా నది ఉగ్రరూపం
విపత్తుగా ప్రకటించడం కాదు నిధులు ఇస్తున్నామా లేదా?
మృతి చెందిన వారికి కేంద్రం రూ.3 లక్షలు ఇస్తుందని చెప్పారు. సీఎం వీటిని కలుపుకుని రూ.5లక్షలు అన్నారా లేక రాష్ట్ర సర్కారు తరఫున అన్నారో తెలియదన్నారు. ఇతర నష్టాలు జరిగిన వాటికి కూడా కేంద్రం సహాయం అందిస్తుందన్నారు. గొర్రెలు చనిపోతే ఒక్కో గొర్రెకు నాలుగు వేలు.. గేదెకు 32 వేలు ఇస్తుందన్నారు. పొలంలో మట్టి పేరుకు పోతే ఒక హెక్టార్‌కు 18 వేలు కేంద్రం ఇస్తుందన్నారు. ఉద్యాన పంటలు నష్టపోతే కేంద్రం సహకారం అందిస్తుందని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా రిపోర్ట్ పంపించి కేంద్రం నుండి నిధులు పొందాలని విజ్ఞప్తి చేస్తున్నామన్నారు. రాష్ర్ట ప్రభుత్వం సహాయము చేయాలి… వైద్యము అందించాలి, మంచి నీళ్ళు ఇవ్వాలి… పూర్తిగా కోల్పోయిన వారికి వెంటనే అన్ని అందించాలని కిషన్ రెడ్డి పేర్కొన్నారు. అవసరమైతే ప్రధాని పర్యటిస్తారని చెప్పారు. జాతీయ విపత్తుగా ఎక్కడా ప్రకటించడం లేదన్నారు. విపత్తుగా ప్రకటించడం కాదు నిధులు ఇస్తున్నామా లేదా అనేది ముఖ్యమన్నారు. వెంటనే విపత్తు జరిగిన ప్రాంతానికి వెళ్లి సహాయక చర్యలకు విఘాతం కలిగించవద్దనేది కేంద్ర ప్రభుత్వ విధానమని చెప్పుకొచ్చారు. కేరళలో అంత విపత్తు సంభవించిన వెంటనే ప్రధాని వెళ్లలేదన్నారు. ఇప్పటి వరకు స్థానిక అధికారులు బాధితుల దగ్గరకి వెళ్ళలేదని.. వారికి సహాయం అందించలేదు అని బాధితులు అంటున్నారని కిషన్ రెడ్డి వ్యాఖ్యానించారు. నష్టాన్ని కూడా అంచనా వేయలేదని ఆయన అన్నారు.
విమోచన వేడుకలు.. ఇక ప్రతి సంవత్సరం
హైదరాబాద్ విమోచన దినోత్సవ వేడుకలు ప్రతి సంవత్సరం జరిగేలా కేంద్రం నిర్ణయం తీసుకుందని కిషన్ రెడ్డి తెలిపారు. సెప్టెంబర్ 17న సికింద్రాబాద్ పరేడ్ మైదానంలో హైదరాబాద్ విమోచన దినోత్సవ వేడుకలు నిర్వహిస్తామని చెప్పారు. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ముఖ్య అతిథిగా రాబోతున్నారని పేర్కొన్నారు. మజ్లీస్‌కు భయపడి గత ప్రభుత్వాలు హైదరాబాద్ విమోచన దినోత్సవ వేడుకలు నిర్వహించలేకపోయాయని ఆయన అన్నారు. బీజేపీ అధికారంలోకి వచ్చాక సెప్టెంబర్ 17న ప్రతి గ్రామ పంచాయతీపైన జాతీయ జెండా ఎగరవేస్తామన్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి.