Kerala Budget: కేరళ రాష్ట్రంలో ఎల్డీఎఫ్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ ఆ రాష్ట్రంలో ప్రతిపక్షాలకు ఆయుధంగా మారింది. పెట్రోల్, డిజిల్, మద్యంపై సెస్ విధించడంపై ప్రజల్లో వ్యతిరేకత వ్యక్తం అవుతోంది. ఇప్పటికే బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు బడ్జెట్ కు వ్యతిరేకంగా రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు నిర్వహిస్తున్నాయి. శుక్రవారం కేరళ ఆర్థిక మంత్రి బాలగోపాల్ అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టారు. డిజిల్, పెట్రోల్, మద్యంపై సెస్ విధిస్తున్నట్లు ప్రకటించారు.
Read Also: Pakistan PM: ఊహకు అందని విధంగా ఐఎంఎఫ్ షరతులు.. తలొగ్గక తప్పని పరిస్థితి..
లీటర్ పెట్రోల్ ,డిజిల్ పై రూ. 2 సామాజిక భద్రత సెస్ విధిస్తున్నట్లు ఆర్థిక మంత్రి ప్రకటించారు. దీని ద్వారా ఏడాదికి రూ. 750 కోట్లు వస్తాయని, అలాగే రూ. 500-999 ధర ఉన్న ఇండియన్ మేడ్ ఫారిన్ లిక్కర్(ఐఎంఎఫ్ఎల్) ప్రతీ బాటిల్ పై రూ. 20, రూ. 1000 కన్నా ఎక్కువ ధర ఉండే మద్యం బాటిల్ పై రూ. 40 సెస్ విధిస్తున్నట్లు ప్రకటించారు. రాష్ట్రం ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న నేపథ్యంలో వీటిపై సెస్ పన్నులు పెంచాలని నిర్ణయించినట్లు మంత్రి చెప్పారు.
ఈ బడ్జెట్ పై కేరళలో ప్రతిపక్షాలు తీవ్ర నిరసన, ఆందోళన కార్యక్రమాలు చేపట్టారు. యూత్ కాంగ్రెస్ కార్యకర్తలు కేరళ బడ్జెట్ పేపర్లను తగలబెట్టారు. తిరువనంతపురంలోని కేరళ సెక్రటేరియట్ వెలుపల బడ్జెట్ కు వ్యతిరేకంగా బీజేపీ యువమోర్చా, యూత్ కాంగ్రెస్ కార్యకర్తలు ఆందోళన నిర్వహించారు. పరిస్థితిని చక్కదిద్దేందుకు పోలీసులు వాటర్ క్యానన్లను ప్రయోగించారు.