ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలపై రాజకీయ ఉత్కంఠ తారాస్థాయికి చేరుకుంది. మహిళల భద్రత, రాజధానిలో పెరుగుతున్న నేరాల గ్రాఫ్‌ను ఎన్నికల ముందు పెద్ద సమస్యగా మార్చాలని అధికార ఆమ్ ఆద్మీ పార్టీ ప్రయత్నిస్తోంది. గత నెల రోజుల నుంచి ఢిల్లీలో శాంతిభద్రతలు, మహిళా భద్రతపై కేజ్రీవాల్ కేంద్రాన్ని నిందిస్తున్నారు. వీటిని ఆయుధంగా మలచుకున్నట్లు కనిపిస్తోంది. ఈ అంశాల్లో కేంద్రం పూర్తిగా విఫలమైందని జనాలను నమ్మించి.. ఓట్లు దండుకునేందుకు యత్నిస్తున్నారని పలువురు ప్రతిపక్ష నేతలు ఆరోపిస్తున్నారు.
READ MORE: Minister Komatireddy: అందుకే కేసీఆర్ అసెంబ్లీకి వస్తలేరు.. మంత్రి కోమటిరెడ్డి సంచలన వ్యాఖ్యలు
తాజాగా ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఈరోజు ఢిల్లీలోని త్యాగరాజ్ స్టేడియంలో ‘మహిళా అదాలత్’కు పిలుపునిచ్చారు. ఇందులో కేజ్రీవాల్ మహిళలను ఉద్దేశించి కేంద్రంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఢిల్లీ మహిళలు ఎంతకాలం భయంభయంగా బతుకుతారని కేజ్రీవాల్ అన్నారు. నిర్భయ ఘటన జరిగి నేటికి 12 ఏళ్లవుతుందని..ఈ ఘటన జరిగినప్పుడు దేశం మొత్తం వీధుల్లోకి వచ్చినట్లు గుర్తుచేశారు. ఈ ఘటన తర్వాత మహిళలపై నేరాలు అంతం అవుతాయని భావించినా.. అది జరగలేదని.. నేరాలు పెరుగుతున్నాయన్నారు. ఈరోజు ఢిల్లీలో కూతుళ్లు కాలేజీకి వెళితే సాయంత్రం 7 గంటలకే తల్లిదండ్రుల గుండెలు దడదడలాడుతున్నాయన్నారు. ఢిల్లీలో నేరస్తులను ఎందుకు పట్టుకోవడం లేదో ఎవరైనా చెప్పగలరా? అని ప్రశ్నించారు.
“10 సంవత్సరాల క్రితం ఓటర్లు పాఠశాల, ఆసుపత్రిని బాగు చేసే బాధ్యతను నాకు ఇచ్చారు. రెండింటినీ ఎలా పరిష్కరించాలో చూపించాను. కరెంటును చౌకగా ఇవ్వాలని కోరారు. నేను ఉచితంగా అందజేశాను. కానీ ఢిల్లీలో ప్రజల భద్రత బాధ్యత మాత్రం కేంద్ర ప్రభుత్వం చేతుల్లో ఉంది. అమిత్ షా ప్రజలకు భద్రతలను సరిగ్గా నిర్వర్తించలేకపోతున్నారు. కేంద్ర ప్రభుత్వ గణాంకాల ప్రకారం ఢిల్లీలో రోజుకు 3-4 అత్యాచార ఘటనలు జరుగుతున్నాయి. అమిత్ షా శాంతిభద్రతలు మీకు సమస్య కాకపోవచ్చు. సాధారణ జనాలను ఇదో పెద్ద సమస్యగా మారింది.” అని అరవింద్ కేజ్రీవాల్ వ్యాఖ్యానించారు.