KCR: జూబ్లీహిల్స్ ఉపఎన్నిక వేడెక్కుతోంది. ఈ బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ రంగంలోకి దిగనున్నారు. రేపు ఎర్రవల్లి ఫార్మ్‌హౌస్‌లో జూబ్లీహిల్స్ ఇన్‌ఛార్జ్‌లతో కేసీఆర్ సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశానికి కేటీఆర్, హరీష్ రావు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరుకానున్నారు. జూబ్లీహిల్స్ ఉపఎన్నిక వ్యూహంపై కీలక నిర్ణయాలు తీసుకోవడంతో పాటు, పార్టీ నేతలకు స్పష్టమైన దిశానిర్దేశం చేయనున్నారు కేసీఆర్. ఎన్నికల్లో బీఆర్‌ఎస్ విజయానికి తగిన వ్యూహం రూపకల్పనపై చర్చలు జరగనున్నాయి. ఇక, జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో బీఆర్‌ఎస్ స్టార్ క్యాంపెయినర్‌గా స్వయంగా కేసీఆర్ పాల్గొనబోతున్నట్లు సమాచారం. ఇప్పటికే కేటీఆర్, హరీష్ రావు కలిసి కేసీఆర్‌ను ఎన్నికల ప్రచారంలో పాల్గొనాలని కోరినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. ఈ పరిణామాలతో ఉపఎన్నిక ప్రచారం మరింత ఉత్కంఠ భరితంగా మారే అవకాశం ఉంది.
READ MORE: Minister Anitha: ప్రజలు జాగ్రత్తగా ఉండండి.. రాబోయే 12 గంటల్లో భారీ వర్షాలు..
మరోవైపు… జూబ్లీహిల్స్ ఉపఎన్నిక నామినేషన్ల గడువు ముగిసింది. మొత్తం 211 మంది అభ్యర్థులు 321 సెట్ల నామినేషన్లు దాఖలు చేశారు. నిన్న ఒక్కరోజే 117 మంది అభ్యర్థులు 194 సెట్ల నామినేషన్లు సమర్పించారు. దీంతో తెల్లవారు జామున మూడు గంటల వరకు నామినేషన్ల స్వీకరణ కొనసాగింది. చివరి రోజు కావడంతో అభ్యర్థులు, పార్టీ ప్రతినిధులు, అనుచరులు రిటర్నింగ్ ఆఫీసు వద్ద గుమిగూడారు. అధికారులు రాత్రంతా నామినేషన్ల స్వీకరణలో నిమగ్నమయ్యారు. ఈరోజు ఉదయం 11 గంటలకు నామినేషన్ల పరిశీలన (స్క్రూటినీ) చేపట్టనున్నారు. ఎల్లుండి వరకు నామినేషన్ల ఉపసంహరణకు అవకాశం ఉన్నట్లు ఎన్నికల అధికారులు తెలిపారు. దీంతో తుది పోటీదారుల జాబితా వచ్చే రెండు రోజుల్లో స్పష్టమవుతుందని భావిస్తున్నారు.