రేపు కాళేశ్వరం కమిషన్ ముందు మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ హాజరుకానున్నారు. బుధవారం ఉదయం 11 గంటలకు బీఆర్కే భవన్‌లోని కాళేశ్వరం కమీషన్‌కు కేసీఆర్ హాజరుకానున్నారు. ఈనెల 6న బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్, 9న బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావును ఓపెన్ కోర్టులో జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ విచారించింది. మేడిగడ్డ బ్యారేజీ పియర్స్ కుంగడం.. అన్నారం, సుందిళ్ల బ్యారేజీల్లో బుంగలు బయటపడిన నేపథ్యంలో గతేడాది రాష్ట్ర ప్రభుత్వం జస్టిస్ పీసీ ఘోష్ నేతృత్వంలో విచారణ కమిషన్‌ను నియమించిన విషయం తెలిసిందే.
కేసీఆర్ రాక సందర్భంగా కాళేశ్వరం కమీషన్ కార్యాలయంలోని కోర్టు హాలుకు అభిమానులు తాకిడి ఎక్కువగా ఉంటే.. మాజీ ముఖ్యమంత్రిని ప్రత్యేకంగా విచారించే అవకాశం ఉంది. ఒకవేళ ఓపెన్ కోర్టు విచారణకు కేసీఆర్ ఒప్పుకోకుంటే.. ఇన్ కెమెరా విచారణ చేసే యోచనలో కమిషన్ ఉన్నట్లు తెలుస్తోంది. కేసీఆర్ విచారణ సందర్భంగా బీఆర్కే భవన్ వద్ద ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా భారీ పోలీస్ బందోబస్తును పోలీసులు ఏర్పాటు చేస్తున్నారు. కమిషన్ విచారణకు హాజరయ్యేందుకు కేసీఆర్ వెళ్లే సమయంలో ఆయనకు మద్దతుగా భారీ సంఖ్యలో బీఆర్ఎస్ శ్రేణులు వెళ్లేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం.
Also Read: MLA Raja SIngh: కుల సమీకరణ ఆధారంగా బీజేపీ అభ్యర్థి.. ఎమ్మెల్యే రాజా సింగ్ హాట్ కామెంట్స్!
రేపు కాళేశ్వరం కమిషన్ ఎదుట హాజరుకానున్న నేపథ్యంలో ఎమ్మెల్యే హరీశ్ రావుతో కేసీఆర్ రెండుసార్లు భేటీ అయ్యారు. ఎర్రవల్లి ఫామ్‌హౌస్‌లో నిన్న, ఈరోజు కేసీఆర్, హరీశ్ రావు మధ్య సుదీర్ఘ చర్చ జరిగింది. కాళేశ్వరం కమిషన్‌కి ఇచ్చేందుకు ఇప్పటికే కేసీఆర్ ఓ నివేదిక సిద్ధం చేశారు. అయితే హరీష్ రావును కాళేశ్వరం కమిషన్ అడిగిన ప్రశ్నల ఆధారంగా మరో నివేదిక కూడా సిద్దం చేశారట. పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కూడా ఇచ్చే యోచనలో కేసీఆర్ ఉన్నట్లు సమాచారం.