Kashibugga Stampede: మంత్రి ఆనం రామ నారాయణ రెడ్డి గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి విశాఖపట్నం వెళ్లి అక్కడి నుంచి శ్రీకాకుళం జిల్లా కాశిబుగ్గ వెంకటేశ్వర స్వామి దేవాలయం తొక్కిసలాట ఘటన స్థలానికి వెళ్లారు. ఈసందర్భంగా ఆయన ఎయిర్పోర్ట్లో మీడియాతో మాట్లాడుతూ.. కాశిబుగ్గలో వెంకటేశ్వర దేవస్థానం వద్ద జరిగిన ప్రమాదం అందరి మనసులను కలిచివేసిందని అన్నారు. ఈ సంఘటన చాలా చాలా దురదృష్టకరమైన సంఘటన అని అన్నారు. అమాయకులైన 9 మంది మహిళలు, 11 ఏళ్ల బాలుడు మృతి చెందటం చాలా బాధాకరం అని చెప్పారు. ఈ దేవస్థానం ఒక ప్రైవేటు ఆర్గనైజేషన్ కింద ప్రైవేటు వ్యక్తులు వ్యక్తిగతంగా నిర్మించుకుని నిర్వహిస్తున్న ఆలయం అని చెప్పారు.
READ ALSO: November 2025 IPOs: నవంబర్ నెలలో నాలుగు ఐపీఓలు.. ఏయే కంపెనీలో తెలుసా !
మంత్రి మాట్లాడుతూ.. ఆలయంలో ఎలాంటి కార్యక్రమాలు, ఉత్సవాల జరుగుతున్నాయనేది ప్రభుత్వ అధికారులు, ప్రజాప్రతినిధులకు తెలియజేయడం లేదని చెప్పారు. ఆలయ కమిటీ వాళ్లు కోట్లు ఖర్చుపెట్టి మంచి ఉద్దేశంతో దేవస్థానాన్ని నిర్మించిన ప్రభుత్వానికి తెలియజేయవలసిన అవసరం అయితే ఉందని పేర్కొన్నారు. ఆ ఆలయానికి దేవాదాయ శాఖ అనుమతులు లేవు, రెవెన్యూ అనుమతులు లేవని వెల్లడించారు. ఆ దేవస్థానం మున్సిపల్ పరిధిలో ఉందని, కానీ ఆలయానికి మున్సిపల్ శాఖ నుంచిఎలాంటి అనుమతులు ఇవ్వలేదని స్పష్టం చేశారు. ఆలయానికి పోలీసుల పరిమిషన్ కూడా లేదని చెప్పారు. ఈరోజు ముక్కోటి ఏకాదశి కావడంతో వేలాదిగా ప్రజలు వస్తారని తెలిసి కూడా స్థానిక అధికారులకు సమాచారం ఇవ్వలేదని చెప్పారు. అయితే జిల్లాలో ఎస్పీ ఏకాదశిని, కార్తీకమాసం పురస్కరించుకుని ఏ ఆలయాల్లో రద్దీ ఎక్కువ ఉంటుదో ఊహించి ముందుచూపుతో కొంతమంది కానిస్టేబుళ్లను అక్కడ ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు.
ఇప్పటి వరకు ఈ ఆలయంలో ఇంత పెద్ద ఉత్సవాలు ఎప్పుడు జరగలేదని, నిర్వాహకులకు కూడా ఇంత జనం వస్తారని ఊహించకుండా ఆలోచన లేకుండా ఉండటంతో ఈ సంఘటన జరిగి ఉండవచ్చని అన్నారు. ఇప్పటికే స్థానిక మంత్రి అచ్చం నాయుడు, శాసనసభ్యులు గౌతు శిరీష ఉదయం నుంచి అక్కడే ఉండి కలెక్టర్, ఎస్పీలతో కలిసి అక్కడ పరిస్థితులను పర్యవేక్షిస్తున్నారని చెప్పారు. మంత్రి లోకేష్, కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు కూడా విశాఖపట్నం నుంచి కాశీబుగ్గకు బయలుదేరి వెళ్లారని పేర్కొన్నారు. వారు కూడా సంఘటన స్థలాన్ని పరిశీలించి తదుపరి సహాయక చర్యలపై నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుందని అన్నారు. మంత్రి లోకేష్ ఆదేశాలు సమగ్రంగా సమీక్షించుకుని అచ్చం నాయుడు , కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడుతో కలిసి, స్థానిక శాసనసభ్యులు శిరీష తో మాట్లాడిన తర్వాత అవసరమైన నివేదికను తీసుకొని ప్రభుత్వానికి ఇవ్వడం జరుగుతుందని చెప్పారు. భవిష్యత్తులో మళ్లీ ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా తగిన చర్యలు తీసుకుంటామని ఆయన చెప్పారు.
READ ALSO: Bhakti Bharat TV: భారతావనికి ‘భక్తి భారత్’.. ‘భక్తి భారత్ టీవీ’ లోగో ఆవిష్కరణ..