జాతీయ రాజకీయాల్లోకి ప్రవేశించి దేశ గుణాత్మక ప్రగతికోసం తన వంతు సహకారాన్ని అందించాలని, అందుకోసం రాజకీయ పార్టీని స్థాపిస్తే కేసీఆర్ కు తమ సంపూర్ణ మద్దతుంటుందని కర్ణాటక మాజీ సీఎం హెచ్‌డీ కుమార స్వామి తెలిపారు. ప్రజాస్వామిక సమాఖ్య స్ఫూర్తి ఫరిఢవిల్లేలా ప్రాంతీయ పార్టీల ఐక్యత నేటి దేశ రాజకీయ తక్షణావసరమని ఇద్దరి మధ్య చర్చ జరిగిందని, కేసీఆర్ జాతీయ పార్టీ ఎజెండాపై చర్చ జరిగినట్లు ఆయన వెల్లడించారు. త్వరలో సీఎం కేసీఆర్ స్థాపించబోయే జాతీయ పార్టీ ఎజెండాపై కూడా ఇరువురు నేతల మధ్య చర్చ జరిగినట్లు ఆయన తెలిపారు. రాబోయే సార్వత్రిక ఎన్నికలనే వేదికగా మలచుకోవాలన్న ఏకాభిప్రాయానికి వచ్చినట్లు తెలుస్తోంది. అయితే.. తెలంగాణ ఉద్యమం ప్రారంభించడానికి ముందు సాగిన అభిప్రాయ సేకరణ మాదిరిగానే ఇప్పటికే మేధావులు, ఆర్థిక వేత్తలు, వివిధ రంగాల నిపుణులతో సుదీర్ఘంగా చర్చలు కొనసాగించమన్న కేసీఆర్.. ప్రత్యామ్నాయ జాతీయ ఎజెండాపై ఏకాభిప్రాయాన్ని సాధించగలిగామని త్వరలోనే జాతీయ పార్టీ ఏర్పాటన్నారు. విధివిధానాల రూపకల్పన జరుగుతుందని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. సకలవర్గాలను కలుపుకొంటూ ముందుకు సాగి, ప్రజాస్వామ్యబద్దంగా, శాంతియుత పంథాలో తెలంగాణ కోసం ఉద్యమించి స్వరాష్ట్రాన్ని సాధించిన ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అపార అనుభవం ప్రస్తుత పరిస్థితుల్లో భారత దేశానికి ఎంతో అవసరం ఉందని కుమారస్వామి స్పష్టం చేశారు.
అరవయేండ్ల తెలంగాణ ప్రజల ఆకాంక్షలను నెరవేర్చుతూ దేశం గర్వించేరీతిలో తెలంగాణను ప్రగతి పథాన నడుపుతున్న కేసీఆర్.. దేశ రాజకీయాల్లో ప్రత్యామ్నాయ వేదిక ఏర్పాటుకు ముందునడుస్తూ, క్రియాశీలక భూమిక పోషించాలని, అందుకు తమ సంపూర్ణ మద్దతుంటుందని కుమారస్వామి తెలిపారు. సిఎం కెసిఆర్, త్వరలోనే జాతీయ పార్టీని ప్రకటించి దేశ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించనున్నారనే వార్తలను కుమారస్వామి స్వాగతించారు. వర్తమాన జాతీయ రాజకీయాల్లో, దేశ పాలనలో ప్రత్యామ్న్యాయ శూన్యత నెలకొన్న నేపథ్యంలో సీఎం కెసిఆర్ వంటి సీనియర్ లీడర్ ఆవశ్యకత దేశానికి అత్యవసరమని ఆయన అభిప్రాయపడ్డారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావుతో కర్నాటక మాజీ ముఖ్యమంత్రి హెచ్‌డీ కుమారస్వామి ఆదివారం మధ్యాహ్నం హైదరాబాద్ ప్రగతిభవన్ లో భేటీ అయ్యారు. ప్రగతి భవన్ కు చేరుకున్న కుమారస్వామికి, సీఎం కేసీఆర్ స్వయంగా ఎదురెళ్లి, సాదరంగా స్వాగతం పలికి.. తన వెంట తోడ్కొని వెళ్లారు. ఈ సందర్భంగా మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి, ఎమ్మెల్సీలు మధుసూధనాచారి, పల్లా రాజేశ్వర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు ఎ.జీవన్‌రెడ్డి, బాల్క సుమన్, ఎస్.రాజేందర్ రెడ్డి తదితరులు ఉన్నారు.