Mudragada Padmanabham: పవన్ కల్యాణ్‌కు కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం మరో లేఖ విడుదల చేశారు. ఇటీవల తాను విడుదల చేసిన లేఖతో మీ అభిమానులతో తనను బండ బూతులు తిట్టిస్తున్నారని, మెస్సేజ్‌లు పెట్టిస్తున్నారని ముద్రగడ లేఖలో ప్రస్తావించారు. మెస్సేజ్‌లకు లొంగిపోయే వ్యక్తిని కాదని, అది ఈ జన్మలో జరగదంటూ కౌంటరిచ్చారు. మీరు సినిమాలో హీరో తప్పా.. రాజకీయాల్లో కాదని.. నన్ను తిట్టాల్సిన అవసరం మీకు, మీ అభిమానులకు ఎందుకొచ్చిందని ప్రశ్నించారు. తాను మీ నౌకరీ చేయనప్పుడు అభిమానులు ఎందుకు తిడుతున్నారు? నాకు సొంత అభిప్రాయాలు ఉండకూడదా.. మీకు తొత్తుగా ఉండాలా.. మీకు నాకు సంబంధం ఏంటి అని ప్రశ్నలు సంధించారు.
కాకినాడ నుంచి పోటీ చేసేందుకు సిద్ధమా అంటూ పవన్ కల్యాణ్‌కు సవాల్ విసిరారు ముద్రగడ. ఒకవేళ తోక ముడిస్తే పిఠాపురం నుంచైనా…తన మీద పోటీ చేస్తారా అని ప్రశ్నించారు. చేగువేరా మీకు ఆదర్శం అంటారు…గుండెలు నిండా ధైర్యం ఉందని చెప్తారు…ఏదో ఒక కోరిక తీర్చే శక్తి పౌరుషం మీకు ఉన్నాయని భావిస్తున్నానంటూ…లేఖలో ఘాటు వ్యాఖ్యలు చేశారు. మీరు, మీ జనసైనికులు నన్ను తిట్టి…యుద్ధానికి రెడీ అవ్వాలనే వాతావరణం కల్పించినందుకు సంతోషం అన్నారు ముద్రగడ. గోచి మొలత్రాడు లేని వారితో నన్ను తిట్టిస్తున్నారన్న ఆయన.. దమ్ముంటే మీరు తనను తిట్టాలని సూచించారు. తానేమీ మీకు బానిసను కాదన్న ముద్రగడ…మీ మోచేతి కింద నీళ్లు తాగడం లేదని హెచ్చరించారు.
రంగా హత్య తర్వాత జైలులో ఉన్నవారిని పవన్ కల్యాణ్ ఎప్పుడైనా పరామర్శించారా? బెయిల్ కోసం లాయర్లతో మాట్లాడారా ? 3500 మందిపై కేసులు ఎత్తేయాలని ఆనాటి సీఎం మర్రి చెన్నారెడ్డిని అడిగారా? 1994లో రావులపాలెంలో కాపులను నాటి సీఎం కొట్టిస్తే.. బాధితులను పలకరించారా? అని నిలదీశారు. 2016 తుని కేసుల్లో ఉన్నవారిని పలకరించారా ? తుని కేసులు తీసేయాలని చంద్రబాబు, జగన్‌లను ఏనాడైనా అడిగారా ? 2016 కేసులను సీఎం జగన్ తీసేసిన సంగతి మీకు తెలుసా ? అంటూ ప్రశ్నల మీద ప్రశ్నలు వేశారు. అమలాపురం అల్లర్ల కేసులో బాధితులకు తానే అండగా ఉన్నానని.. మీ కోసం తపించే వారిపై కేసులు పెడితే పవన్ కల్యాణ్ ఎందుకు వెళ్లి పలకరించలేదని ముద్రగడ నిలదీశారు. బెయిల్ కోసం లాయర్లతో ఎందుకు మాట్లాడలేదు అని కాపు ఉద్యమానికి సంబంధించిన విషయాలను ఏకరవు పెట్టారు. అంతేకాదు కాపుల కోసం పవన్ ఏం చేశారు? ఏనాడైనా కాపుల గురించి మాట్లాడారా? మీకోసం రోడ్ల మీదకు రావాలి.. అలా వచ్చినవాళ్లు ఆపదలో ఉంటే వారికి సాయం చేయరా అని జనసేనానని కార్నర్ చేశారు ముద్రగడ. కాపుల కోసం మొదటి నుంచి తాను ఉద్యమించానని.. పవన్ కల్యాణ్ పాత్ర ఏమీ లేదని సొంత సామాజికవర్గానికి మెసేజ్ వెళ్లేలా రంగా హత్య నుంచి అమలాపురం అల్లర్ల వరకు జరిగిన పరిణామాలను ఉదహరించారని చర్చ నడుస్తోంది.