తెలుగు తెరపై మలయాళ నటుల ప్రభావం ఎప్పుడూ ఉంటుంది, తాజాగా ఆ జాబితాలో చేరిన మరో విలక్షణ నటుడు సుదేవ్ నాయర్. వరుస బ్లాక్ బస్టర్ చిత్రాల్లో కీలక పాత్రలు పోషిస్తూ, తెలుగు ప్రేక్షకులకు తనదైన విలనిజాన్ని రుచి చూపిస్తున్నారు. ఒకప్పుడు విలన్ అంటే కేవలం అరుపులు, కేకలే అనుకునేవారు కానీ ఇప్పుడు స్టైలిష్‌గా ఉంటూనే, కళ్లతోనే భయాన్ని పుట్టించే విలన్లకు కాలం నడుస్తోంది. అచ్చం అలాంటి బాడీ లాంగ్వేజ్‌తో తెలుగు సినిమా మేకర్ల దృష్టిని ఆకర్షిస్తున్నారు సుదేవ్ నాయర్.
Also Read:Gandhi Talks Review : గాంధీ టాక్స్ రివ్యూ.. విజయ్ సేతుపతి మూకీ సినిమా ఎలా ఉందంటే?
సుదేవ్ నాయర్ నటించిన గత చిత్రాలను గమనిస్తే, ఆయనకు టాలీవుడ్‌లో ‘లక్కీ హ్యాండ్’ ఉందనే చెప్పాలి. పవన్ కళ్యాణ్ OG చిత్రంలో ఆయన పోషించిన పాత్రకు విమర్శకుల నుండి ప్రశంసలు దక్కాయి. ఆ చిత్రంలో ఆయన స్క్రీన్ ప్రెజెన్స్ మాస్ ఆడియన్స్‌కు బాగా కనెక్ట్ అయ్యింది. మెగాస్టార్ చిరంజీవి ప్రతిష్టాత్మక మన శంకర వర ప్రసాద్ గారు చిత్రంలో సుదేవ్ మరోసారి తన విశ్వరూపాన్ని చూపించారు. దర్శకుడు అనిల్ రావిపూడి ఈయనలోని డిఫరెంట్ షేడ్స్‌ను అద్భుతంగా వెలికితీశారు. ఒక సంక్లిష్టమైన పాత్రను అంతే సునాయాసంగా పండించి మెగా ఫ్యాన్స్‌ను మెప్పించారు.
సుదేవ్ కేవలం నటుడు మాత్రమే కాదు ఒక క్రీడాకారుడు కూడా. ఆయనకు మార్షల్ ఆర్ట్స్‌లో ఉన్న ప్రావీణ్యం యాక్షన్ సీక్వెన్స్‌లలో స్పష్టంగా కనిపిస్తుంది. అథ్లెటిక్ బాడీ, కండలు తిరిగిన శరీరంతో విలన్ పాత్రలకు ఒక పవర్‌ఫుల్ లుక్ తీసుకొస్తున్నారు. పాత్ర కోసం పరకాయ ప్రవేశం చేసే ఆయన నిబద్ధత అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. చాలామంది ఇతర భాషా నటులు కేవలం నటనకే పరిమితమవుతారు. కానీ సుదేవ్ నాయర్ తెలుగు భాషపై ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్నారు. భవిష్యత్తులో తన పాత్రలకు తానే సొంతంగా డబ్బింగ్ చెప్పుకోవాలనే ప్రయత్నం చేస్తున్నారు. ఇక కన్నడ స్టార్ యష్ నటిస్తున్న ‘టాక్సిక్’ చిత్రంలో సుదేవ్ ఒక ప్రధాన పాత్రను పోషిస్తున్నారు.