kamal haasan:’తేనె కన్నా తియ్యనిది… తెలుగు భాష’ అంటూ మనం పొంగిపోతూ పాడుకుంటూ ఉంటాం. అయితే తెలుగులోని తీయదనాన్ని నిజంగా గ్రోలినవారు పరభాషకు చెందినవారేనని పెద్దలు చెబుతారు. తమిళ మహాకవి సుబ్రమణ్య భారతి ‘తెలుంగు తీయదనం’ గురించి చెప్పిన వైనాన్ని ఏ తమిళుడూ మరచిపోరాదంటారు విలక్షణ నటుడు కమల్ హాసన్. ఆయన తమిళనాట పుట్టినా, తెలుగు అంటే ప్రాణం పెడతారు. నిజం చెప్పాలంటే, మహాకవి శ్రీశ్రీ రచనలంటే కమల్ హాసన్ కు ప్రాణం. అలాగే కమల్ హాసన్ ను ఇటు తెలుగులోనూ, అటు తమిళనాట స్టార్ గా నిలిపిన ‘మరో చరిత్ర’ సినిమా తెలుగులోనే తెరకెక్కింది , అందునా తెలుగునేల అయిన విశాఖపట్టణంలో! ఈ కారణంగానూ కమల్ కు తెలుగు అంటే మరింత అభిమానం అని చెప్పక తప్పదు. తెలుగు సామెతలు- వాటిలోని తీయదనాన్ని సైతం కమల్ ఎంతగానో ఆస్వాదిస్తూ ఉంటారు. ఈ విషయాలను కమల్ సొంత అన్నగా భావించే మధురగాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం సైతం పలుమార్లు వివరించారు. కమల్ అనువాద చిత్రాలకు అనేకసార్లు రచన చేసిన వెన్నెలకంటి కూడా తన సాహిత్యంతో ఆయనను ఆకట్టుకున్నారు.
ఇలా తెలుగు భాషను ఎంతగానో అభిమానించే కమల్ హాసన్ ఓ సందర్భంలో నేడు తమిళనాడుగా పేరొందిన ప్రాంతాన్ని ఎక్కువకాలం పాలించినవారు, ప్రభావితం చేసిన వారు తెలుగువారేనని తెలిపారు. తమిళదేశాన్ని పాలించిన చోళుల మాతృభాష తెలుగు అనీ, ముఖ్యంగా రాజరాజ చోళుని కాలంలో తంజావూరు రాజధాని కావడం వల్లే అక్కడ ఎంతో తెలుగు సాహిత్యం నిక్షిప్తమై ఉందనీ కమల్ తన చారిత్రక పరిజ్ఞానాన్ని ‘భామనే సత్యభామనే’ సమయంలో తెలుగువారికి వివరించి ఆశ్చర్యపోయేలా చేశారు. అంతేకాదు, స్వరాజ్యసమరంలో పాల్గొన్న ‘వీరపాండ్య కట్టబొమ్మన’ సైతం తెలుగువాడేనని, ఇక ద్రవిడ ఉద్యమం నడిపిన రామస్వామి నాయగర్ కూడా తెలుగువారేనన్న విషయాలనూ ఆ సందర్భంగా కమల్ హాసన్ ప్రస్తావించారు.
వీటన్నిటికంటే ముందుగా నందమూరి బాలకృష్ణను స్టార్ హీరోగా నిలిపిన ‘మంగమ్మగారి మనవడు’ శతదినోత్సవం 1984 డిసెంబర్ లో జరిగింది. చెన్నైలోని విజయశేష్ మహల్ లో జరిగిన ఆ వేడుకలో కమల్ హాసన్ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఆ సమయంలో ‘తాను తెలుగువాడిగా పుట్టనందుకు బాధపడుతూ ఉంటానని’ ఆయన స్వయంగా పేర్కొనడం గమనార్హం! అందుకు కారణం లేకపోలేదు. కమల్ అభిమానించే నటుడు శివాజీ గణేశన్. ఆయన తొలిసారి నటించిన ‘పరదేశి’ తెలుగు సినిమా కావడం విశేషం! ఆ తరువాతే శివాజీ నటించిన ‘పరాశక్తి’ తమిళ చిత్రం తెరకెక్కింది. ఇక కమల్ కు స్టార్ ఇమేజ్ సంపాదించిన చిత్రం ‘మరోచరిత్ర’. ఇది తెలుగులోనూ, హిందీలోనూ రూపొందింది. హిందీలో ఈ చిత్రాన్ని ‘ఏక్ దూజే కేలియే’ పేరుతో తెలుగు దిగ్దర్శకులు ఎల్వీ ప్రసాద్ నిర్మించడం విశేషం! పైగా తన అభిమాన నటుడు శివాజీ గణేశన్ ను నటునిగా ‘పరదేశీ’లో నటింప చేసిందీ, ఆ తరువాత ‘మనోహర’ పాత్రలో తీర్చిదిద్దిందీ ఎల్వీ ప్రసాదే కావడంతో, కమల్ కు ఆయనంటే ఎంతో గౌరవం. అందువల్లే తాను నిర్మాతగా మారి రూపొందించిన తొలి చిత్రం ‘అమవాస్య చంద్రుడు’లో ఎల్వీ ప్రసాద్ ను హీరోయిన్ మాధవి తాత పాత్రలో నటించమని కోరారు. కమల్ అభిలాష మేరకు ఎల్వీ ప్రసాద్ ఆ పాత్ర ధరించి అలరించారు. ఇలా చెప్పుకుంటూ పోతే కమల్ కు తెలుగువారితోనూ, తెలుగునేలతోనూ ఎంతో అనుబంధం ఉంది. అందువల్లే కమల్ హాసన్ నటించే చిత్రాలకు తమిళనాడులో కన్నా మిన్నగా తెలుగునాట ఆదరణ లభిస్తూ ఉంటుంది.
Vishwak Sen: ఈ గొడవలు నా వలన కావడం లేదు.. హిమాలయాలకు పోతున్నా
ఒకానొక సందర్భంలో అప్పటి తమిళనాడు ముఖ్యమంత్రి జయలలితకు కమల్ కొరకరాని కొయ్యగా కనిపించారు. దాంతో ఆయన ‘విశ్వరూపం’ చిత్రానికి పలు అడ్డంకులు కల్పించారు. అందువల్ల ముందు ‘విశ్వరూపం’ చిత్రాన్ని తెలుగులోనే విడుదల చేశారు కమల్. అప్పుడు తెలుగు చిత్రసీమ కమల్ కు దన్నుగా నిలచింది. చాలా రోజుల తరువాత కమల్ కు ‘విక్రమ్’తో మరో ఘనవిజయం లభించింది. ఈ సినిమా తెలుగునేలపైనా మంచి విజయాన్ని మూటకట్టుకుంది. ఈ మూవీకి సీక్వెల్ కూడా రూపొందనుంది. కమల్ కు జాతీయ స్థాయిలో ఉత్తమ నటునిగా అవార్డు సంపాదించి పెట్టిన ‘ఇండియన్’ కు శంకర్ సీక్వెల్ సిద్ధం చేస్తున్నారు. ప్రస్తుతం కమల్ ఆ సినిమాలోనే నటిస్తున్నారు. ఆ చిత్రం ఎప్పుడు వస్తుందా అని కమల్ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ముఖ్యంగా కమల్ ను అభిమానించే తెలుగు అభిమానులు ‘ఇండియన్-2’ కోసం మరింత ఆసక్తితో ఉన్నారు. మరి రాబోయే సినిమాలతో కమల్ ఏ తీరున మురిపిస్తారో చూడాలి.