Vishwak Sen: టాలీవుడ్ యంగ్ హీరో విశ్వక్ సేన్, నటుడు, దర్శకుడు అర్జున్ మధ్య వివాదం నడుస్తున్న విషయం విదితమే. నిన్ననే అర్జున్ ప్రెస్ మీట్ పెట్టి విశ్వక్ పై ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఇక అర్జున్ సైతం మా ప్రెసిడెంట్ మంచు విష్ణుకు విశ్వక్ పై ఫిర్యాదు చేశాడు. ఈ నేపథ్యంలోనే తాజాగా విశ్వక్ తనపై అర్జున్ చేసిన ఆరోపణలపై స్పందించాడు. ఏఎమ్ బి సినిమాస్ లో రాజయోగం మూవీ టీజర్ లాంచ్ ఈవెంట్ కు ముఖ్య అతిథి గా విచ్చేసిన విశ్వక్ మాట్లాడుతూ.. “రెండు రోజుల నుంచి జరుగుతున్న ఈ అలజడులు, గొడవలు నాతో కావడం లేదు.. రెండు మూడు రోజులు హిమాలయాలకు వెళ్దాం అనుకుంటున్నా. నేను ప్రతి సినిమా నాది అనుకొని చేశాను. సినిమాకీ నా అంత కమిటెడ్ గా ఎవరు ఉండరు. నేను కమిటెడ్ ప్రొఫెషనల్ యాక్టర్ ని, నా వల్ల ఎవరు నిర్మాతలు డబ్బులు పోగొట్టుకోలేదు.. ఎవరైనా నాతో సినిమా చేసిన వాళ్ళు కమిటెడ్ కాదు అని చెప్తే నేను ఇక్కడ ఉండను.
అర్జున్ కు, నాకు మధ్య సరైన అవగాహన లేదు. నేను ఆ సినిమాకి నా వంతు ఎఫర్ట్ పెట్టి చేద్దాము అనుకున్నా.. కానీ నాకు విలువ లేని చోట ఉండలేను. అర్జున్ తో నేను సినిమా చేయను అని చెప్పలేదు. నేను చెప్పిన మాటలు వాళ్లకు అలా అర్థమయ్యాయని నేను లేటుగా రియలైజ్ అయ్యాను. వాళ్ల మేనేజర్ రెండు రోజుల తరువాత మాకు కాల్ చేసి రెమ్యునరేషన్ వెనక్కి పంపించమని చెప్పాడు. సెట్ మీద డిస్కషన్ రావద్దు అని రెండు రోజులు మాట్లాడుకొని వెళ్దాము అని చెప్పాను. అర్జున్ తో కూడా ఇదే చెప్పాను. నా పరిస్తితి మీకు చెప్పాను తప్పా రైటా అనేది మీరే చెప్పండి.. నేను సినిమా బాగా రావడానికి మాట్లాడుకుందాం అని మెసేజ్ కూడా పెట్టాను. దానికి ఆయన స్పందించలేదు. నేను ఏమి చేసిన ఆ సినిమా మంచిగా రావడం కోసమే చేశాను..వాస్తవాలు తెలీకుండా మాట్లాడుతుంటే భాధగా ఉంది. అర్జున్ గారు మంచి సినిమా చెయ్యాలి ఆయన బాగుండాలి అని చెప్పుకొచ్చాడు.