సాధారణంగా ఏ ఆపరేషన్ జరిగినా.. పేషెంట్‌కు వైద్యులు అనస్థీషియా (మత్తుమందు) ఇస్తారు. అనస్థీషియా నొప్పిని తెలియకుండా చేస్తుందన్న విషయం తెలిసిందే. అయితే తాజాగా ఓ పేషెంట్‌కు అనస్థీషియా ఇవ్వకుండా.. సినిమాలోని కామెడీ సీన్స్ చూపిస్తూ ఆపరేషన్‌ను విజయవంతంగా పూర్తి చేశారు. పేషెంట్ తన చేతులతో ట్యాబ్ పట్టుకుని కామెడీ సీన్స్ చూస్తూ ఉండగా.. వైద్యులు ఆమె తలలో కణితిని తొలగించారు. ఈ ఘటన ఏపీలోని కాకినాడలో చోటుచేసుకుంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి…
తొండంగి మండలం ఎ.కొత్తపల్లికి చెందిన అనంతలక్ష్మి (55)కి కొంతకాలంగా కుడికాలు, కుడిచేయి బాగా లాగుతున్నాయి. పలు ప్రైవేటు ఆసుపత్రుల్లో చికిత్స తీసుకున్నా.. ఫలితం లేదు. అనంతలక్ష్మి తలలో పెద్ద కణితి ఉందని, ఆపరేషన్‌కు చాలా ఖర్చవుతుందని డాక్టర్లు చెప్పారు. సెప్టెంబర్ 11న అనంతలక్ష్మికి తలనొప్పి వచ్చి మూర్ఛపోయారు. ఆమె శరీరంలో కుడివైపు భాగాలు మొద్దుబారిపోయాయి. దాంతో కుటుంబ సభ్యులు గుంటూరు జీజీహెచ్‌లో చేర్పించారు. వైద్యులు ఆమెను పరీక్షించి.. మెదడులో ఎడమవైపు 3.3×2.7 సెంమీల పరిమాణంలో కణితి ఉన్నట్లు గుర్తించారు. అనంతలక్ష్మికి వెంటనే ఆపరేషన్ చేయాలని చెప్పారు.
Also Read: Gold Rate Today: బంగారం ధరలకు బ్రేక్.. వరుసగా రెండోరోజు తగ్గిన గోల్డ్ రేట్స్!
అవేక్ క్రేనియాటమీ అనే క్లిష్టమైన చికిత్సను రోగి మెలకువలో ఉండగానే చేయవల్సి ఉంటుంది. దాంతో మంగళవారం మధ్యాహ్నం అనంతలక్ష్మికి అతి తక్కువ మోతాదులో మత్తు ఇచ్చారు. సర్జరీ సమయంలో అనంతలక్ష్మి తన చేతులతో ట్యాబ్ పట్టుకుని అదుర్స్ సినిమాలోని ఎన్టీఆర్, బ్రహ్మనందం మధ్య వచ్చే కామెడీ సీన్స్ చూస్తుండగా.. వైద్యులు ఆమె తలలో కణితిని శస్త్రచికిత్స చేసి తొలగించారు. గుంటూరు జీజీహెచ్‌లో మొదటిసారిగా ఇలాంటి శస్త్రచికిత్స చేశామని కాకినాడ వైద్యలు తెలిపారు. ప్రస్తుతం అనంతలక్ష్మి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని, మరో అయిదు రోజుల్లో డిశ్ఛార్జి చేస్తామని డాక్టర్లు చెప్పారు. విషయం తెలిసిన వారు ‘కాకినాడ వైద్యులు అదుర్స్’ అని పొగిడేస్తున్నారు.