పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ఈ రోజు ఉదయం 11 గంటలకు ప్రారంభమయ్యాయి. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పార్లమెంట్ ఉభయసభల సభ్యులను ఉద్దేశించి సెంట్రల్‌హాల్‌లో ప్రసంగించారు. రాష్ట్రపతి ముర్ము ప్రసంగాన్ని భారత్ రాష్ట్ర సమితి(బీఆర్ఎస్), ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీలు బహిష్కరించారు. అయితే.. ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత కే. కేశవరావు మాట్లాడుతూ.. ఈ ప్రభుత్వం 8 ఏళ్లలో ఏమి చేయలేదని, రాష్ట్రపతికి వ్యతిరేకంగా లేమని, ప్రజాస్వామ్యబద్దంగా మా నిరసన తెలిపామన్నారు. అంతేకాకుండా.. సామాజిక, గిరిజన, మహిళ అంశాలపై పెద్దగా మాట్లాడారని, ఇవన్నీ పాలనలో ఎక్కడా లేవని ఆయన విమర్శించారు. అసలు నిరుద్యోగంపై మాటే లేదని, విద్యా, ఆరోగ్యం ప్రస్తావన లేదని, వీటన్నింటిపైన కేంద్ర ప్రభుత్వం దృష్టి పెట్టాలని ఆయన తెలిపారు. ఎన్డీయే ప్రభుత్వం చేస్తున్న తప్పులను చూపకపోతే ఎలా.? అని ఆయన అన్నారు. తెలంగాణలో గవర్నర్ పరిస్థితి చూస్తున్నామని, బడ్జెట్ ఆమోదం కోసం కోర్టుల దాకా వెళ్లాల్సిన పరిస్థితి వస్తోందన్నారు.
Also Read : Union Budget 2023: పార్లమెంట్‌లో ఆర్థిక సర్వే ప్రవేశపెట్టిన నిర్మలా సీతారామన్
ఢిల్లీలో లెఫ్ట్ నెంట్ గవర్నర్ వ్యవహారంతో ఆప్ ప్రభుత్వం పడుతున్న ఇబ్బందులను చూస్తున్నామని, అనేక రాష్ట్రాలు కేరళ, తమిళనాడులో గవర్నర్ల చేసే పరిణామాలు చూస్తున్నామని ఆయన వ్యాఖ్యానించారు. వీటన్నిటిపైన దృష్టి సారించాలనే బహిష్కరణ నిర్ణయం తీసుకున్నామని ఆయన పేర్కొన్నారు. లోక్ సభపక్ష నేత నామా నాగేశ్వరరావు మాట్లాడుతూ.. రాష్ట్రపతి మీద, ప్రసంగం మీద గౌరవం ఉందని, మహిళల గురించి ప్రసంగంలో చెప్పారని, నిన్న మహిళ రిజర్వేషన్ బిల్లు గురించి అఖిలపక్షం సమావేశంలో చెప్పినం.. ఇవాళ ఆ ప్రస్తావన లేదని ఆయన అన్నారు. 3, 4 సార్లు అంబేద్కర్ పేరును తలుచుకున్నారని, పార్లమెంట్ భవన్ కు అంబేద్కర్ పేరు పెట్టాలని డిమాండ్ చేస్తున్నా… ఆ ప్రస్తావన లేదన్నారు. రైతుల సమస్యలపై ప్రస్తావన లేదని, మా మాదిరిగా రైతుబంధు ఇవ్వాలని ఎప్పటి నుండో అడుగుతున్నామని ఆయన తెలిపారు.
Also Read : MATA: కెనడాలో అంబరాన్నంటిన సంక్రాంతి సంబరాలు
కనీస మద్దతు ధర ప్రస్తావన లేదన్నారు. రైతులపై పెట్టిన కేసులు వెనక్కి తీసుకోలేదని, ఇరిగేషన్ మీద మాట్లాడే హక్కు కేంద్రానికి లేదని, తెలంగాణలో ఇరిగేషన్ రంగం అభివృద్ధి ఏంటో ముఖ్యమంత్రి కేసీఆర్ చూపించారని ఆయన వెల్లడించారు. ఇంటింటికి నీళ్లు ఇచ్చామని చెప్పారని, మేము ముందే ప్రతి ఇంటికి తెలంగాణలో నీళ్లు ఇచ్చామన్నారు. నాలుగేళ్లుగా ఇంటింటికి నీళ్లు ఇవ్వాలని కేంద్రాన్ని డిమాండ్ చేస్తున్నామన్నారు. తెలంగాణ అభివృద్ధిని కాపీ కొట్టి పథకాలు అమలు చేస్తున్నారని ఆయన విమర్శించారు. కానీ తెలంగాణను అభివృద్ధిని ఎందుకు అడ్డుకుంటున్నారని, తెలంగాణకు ఒక్క మెడికల్ కాలేజి ఇవ్వలేదని, రాష్ట్ర ప్రభుత్వ స్వంత నిధులతో మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేసుకుంటున్నామన్నారు. తెలంగాణకు కేంద్రం చేసింది ఏమి లేదని, ప్రతి అంశంలో కేంద్రాన్ని నిలదిస్తామన్నారు. ఎనిమిది ఏళ్లలో ఏం చేశారో చెప్తామన్నారు.