జూబ్లీ హిల్స్ గ్యాంగ్ రేప్ కేసు తెలంగాణలో ప్రకంపనలు రేపుతోంది. అధికార టీఆర్ఎస్ పార్టీతో పాటు ఎంఐఎం పార్టీని టార్గెట్ చేస్తూ బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు తీవ్రంగా విమర్శిస్తున్నాయి. కేసును పక్కదోవ పట్టించేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నట్లు నాయకులు ఆరోపణలు చేస్తున్నారు. నిన్న బాధితురాలికి న్యాయం చేయాలంటూ బీజేపీ కార్యకర్తలు జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ ముట్టడించిన సంగతి తెలిసిందే.
తాజాగా హైదరాబాద్ లో అమ్మాయిపై జరిగిన అత్యాచార ఘటనను నిరసిస్తూ యూత్ కాంగ్రెస్ నేషనల్ జనరల్ సెక్రటరీ ఎం. అనిల్ యాదవ్ ఆధ్వర్యంలో ట్యాంక్ బండ్ పై సీఎం దిష్టి బొమ్మ దహనం కార్యక్రమాన్ని నిర్వహించేందుకు ప్రయత్నించారు. దీన్ని అడ్డుకున్న పోలీసులు కాంగ్రెస్ కార్యకర్తలను అరెస్ట్ చేసి సికింద్రాబాద్ రాంగోపాల్ పేట పోలీస్ స్టేషన్ కు తరలించారు. బీజేపీ కార్యాలయం ముట్టడికి వెళ్తున్న ఎన్ఎస్ యుఐ రాష్ట్ర అధ్యక్షుడు బల్మూరు వెంకట్ ను అదుపులోకి తీసుకుని పోలీసులు గాంధీనగర్ పోలీస్ స్టేషన్ కు తరలించారు.
పోలీసులు చర్యను తీవ్రంగా ఖండించారు సీఎల్పీ లీడర్ భట్టి విక్రమార్క. అరెస్టులు అక్రమం అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. మాజీ మంత్రి శ్రీధర్ బాబుతో కలిసి భట్టి విక్రమార్క సికింద్రాబాద్ రామ్ గోపాల్ పేట పోలీస్ స్టేషన్ కు వెళ్లారు. అరెస్ట్ అయిన అనిల్ యాదవ్ తో పాటు కాంగ్రెస్ కార్యకర్తలను నేతలు పరామర్శించారు. హైదరాబాద్ అడిషనల్ పోలీస్ కమిషనర్ తో ఫోన్ లో మాట్లాడి అరెస్ట్ చేసిన వారందరినీ వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.