Rohit Sharma, Virat Kohli to Play Duleep Trophy 2024: శ్రీలంక పర్యటన అనంతరం 40 రోజుల వరకు భారత జట్టుకు ఎలాంటి సిరీస్‌లు లేవు. బంగ్లాదేశ్‌తో సెప్టెంబర్ 19 నుంచి టెస్టు సిరీస్ మొదలుకానుంది. ఈలోగా దేశవాళీ క్రికెట్ ఆడాలని భారత క్రికెటర్లకు బీసీసీఐ నుంచి ఆదేశాలు వచ్చినట్లు తెలుస్తోంది. సెప్టెంబర్ 5 నుంచి ప్రారంభమయ్యే దులీప్ ట్రోఫీలో భారత స్టార్ ప్లేయర్స్ అందరూ ఆడుతారని సమాచారం. టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ, స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ కూడా డొమిస్టిక్ క్రికెట్లో ఆడతారనే వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.
కేఎల్ రాహుల్, సంజూ శాంసన్, శుభ్‌మన్ గిల్, రవీంద్ర జడేజా, యశస్వి జైస్వాల్, సూర్యకుమార్ యాదవ్, కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్ సహా మిగతా క్రికెటర్లు కూడా దులీప్ ట్రోఫీలో ఆడనున్నారు. సెంట్రల్ కాంట్రాక్ట్‌కు దూరమైన వికెట్ కీపర్ ఇషాన్ కిషన్ కూడా ఆడేందుకు సిద్ధమయ్యాడు. గాయం నుంచి కోలుకున్న పేసర్ మహమ్మద్ షమీ సైతం ఆడతాడు. అయితే కేవలం ఒక్క క్రికెటర్‌కు మాత్రమే దులీప్ ట్రోఫీ నుంచి మినహాయింపు ఇచ్చినట్లు తెలుస్తోంది. పని ఒత్తిడి కారణంగా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రాకు రెస్ట్ ఇవ్వనున్నారట.
Also Read: Bigg Boss 8 Promo: ఇక్కడ కమిట్ అయితే లిమిటే లేదు.. ‘బిగ్‌బాస్’ తెలుగు ప్రోమో అదిరిందిగా!
సీనియర్ క్రికెటర్లు అజింక్య రహానే, ఛెతేశ్వర్ పుజారా సైతం దులీప్ ట్రోఫీలో ఆడనున్నారట. ఈ ఇద్దరు పరుగులు చేసినా.. జాతీయ జట్టులో చోటు దక్కించుకోవడం కష్టమే. అజిత్ అగార్కర్ నేతృత్వంలోని బీసీసీఐ సెలక్షన్ కమిటీ దులీప్ ట్రోఫీ కోసం నాలుగు జట్లను ఎంపిక చేస్తుందని తెలుస్తోంది. ఇండియా ఎ, ఇండియా బి, ఇండియా సి, ఇండియా డి జట్లలో టీమిండియా స్టార్స్ ఆడనున్నారు. దులీప్ ట్రోఫీలో ఆడటం వల్ల బంగ్లాతో టెస్టు సిరీస్‌కు సన్నద్ధమయ్యేందుకు అవకాశం ఉంటుందని బీసీసీఐ భావిస్తోంది.