Pawan Kalyan: ఎన్నికలు దగ్గర పడుతున్న తరుణంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఎన్నికలకు సమయం తక్కువగా ఉండడంతో తన దృష్టంతా అటువైపుగా మళ్లిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే అధికార వైసీపీ పార్టీ పవన్‌ను నాన్‌లోకల్ అని విమర్శిస్తున్న తరుణంలో ఆ విమర్శలకు చెక్ పెట్టాలని ఆయన నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. రాష్ట్ర ప్రజలకు అతి చేరువలో ఉండాలని నిర్ణయించుకున్నారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. ఈ క్రమంలోనే పవన్ తన మకాంను మంగళగిరికి షిఫ్ట్ చేసినట్టుగా తెలుస్తోంది. ఇక్కడి నుంచే పార్టీకి సంబంధించి కార్యకలాపాలు కొనసాగించాలని ఆయన భావిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పార్టీని ఓడించే లక్ష్యంతో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నట్లు రాజకీయ వర్గాలు చెబుతున్నాయి.
Also Read: Telangana High Court: జేసీ ప్రభాకర్‌రెడ్డికి తెలంగాణ హైకోర్టు నోటీసులు
ఇప్పటివరకు హైదరాబాద్ నుంచి పార్టీ కార్యక్రమాలను పర్యవేక్షించిన పవన్ కళ్యాణ్.. ఇకపై మంగళగిరి నుంచే నిర్వహించనున్నారు. అంతే కాకుండా పార్టీ కేంద్ర కార్యాలయాన్ని హైదరాబాద్ నుంచి మంగళగిరికి మార్చేశారు. కేంద్ర కార్యాలయ సిబ్బంది, ఫైల్స్, ఇతర విభాగాలు, కంప్యూటర్లను మంగళగిరికి తరలించినట్లు తెలుస్తోంది. పవన్ కూడా ప్రస్తుతం మంగళగిరిలోని బస చేయనున్నారని తెలుస్తోంది. మంగళగిరి పార్టీ కేంద్ర కార్యాలయంలో పవన్ కళ్యాణ్‌కు అనుగుణంగా ఇంటి నిర్మాణం జరిగినట్లు పార్టీ వర్గాలు వెల్లడిస్తున్నాయి. ఏదైనా పనులు, సినిమా షూటింగ్ షెడ్యూల్‌లో మాత్రమే పవన్ హైదరాబాద్ వెళ్లనున్నారని సమాచారం. ఎవరైనా పవన్‌తో చర్చలు సినిమాలకు సంబంధించి చర్చలు జరపాలంటే మంగళగిరి వస్తున్నారని సంబంధిత వర్గాలు పేర్కొంటున్నాయి. ఇక, ఇప్పటికే రెండు విడతల వారాహి యాత్రను పూర్తి చేసుకున్న పవన్ కల్యాణ్.. మూడో విడతకు సంబంధించిన షెడ్యూల్‌పై పార్టీ ముఖ్య నాయకులతో చర్చలు జరుపుతున్నారు.