Jagga Reddy : సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఇటీవల మీడియాతో చిట్‌చాట్ చేశారు. ఆయన తన సినీ ప్రయాణం, రాజకీయ భవిష్యత్తు, అభివృద్ధి పై కీలక వ్యాఖ్యలు చేశారు. జగ్గారెడ్డి మాట్లాడుతూ, మూడు నెలల క్రితం దర్శకుడు రామానుజం తన వద్దకు వచ్చి, ఒక ఫోటో చూపించారని చెప్పారు. ఆ ఫోటో చూసిన వెంటనే తనకు కనెక్షన్ కలిగిందని, 2013 నుంచి దర్శకుడు తనలాంటి వ్యక్తిని వెతుకుతున్నారని చెప్పాడని వెల్లడించారు. మొదటగా సినిమాకు సమయం ఇవ్వలేనేమో అనుకున్నా, కానీ ఆ ఫోటో చూసిన తర్వాత సినిమాను చేయాలని ఖచ్చితంగా నిర్ణయించుకున్నట్లు తెలిపారు.
ఈ సినిమాకు A WAR Love అనే క్యాప్షన్‌ను దర్శకుడు ముందుగానే రాసుకున్నారని చెప్పారు. అయితే, ఈ కథకు ప్రేమకథతో పెద్దగా సంబంధం లేదని, తన నిజజీవిత సంఘటనల ఆధారంగా తెరకెక్కుతున్న సినిమా అని వివరించారు. సినిమా స్టార్ట్ అయినప్పుడు దర్శకుడు ఒక భాగం చెప్పాడని, మిగతా కథ తన జీవితంలో జరిగిన కొన్ని విషయాలను పంచుకున్నానని అన్నారు. ఈ చిత్రంలో విద్యార్థి నాయకుడిగా, కౌన్సిలర్‌గా తన పాత్ర ఉంటుందని, మున్సిపల్ ఛైర్మన్‌గా ఎలా మారాడు అనేది చూపించనున్నామని చెప్పారు. సినిమా లవ్, ఫ్యాక్షన్, ఎమోషన్, పొలిటికల్ అంశాలతో ఆసక్తికరంగా సాగుతుందని తెలిపారు.
తాను రాజకీయాల్లో కొనసాగుతూనే సినిమా చేస్తున్నానని, దీని ద్వారా తన రాజకీయ భవిష్యత్తుకు ఎలాంటి అడ్వాంటేజ్ ఉండదని స్పష్టం చేశారు. ఢిల్లీ టూర్ తనను పూర్తిగా మార్చేసిందని, ఈ పరిణామాలు ఎటు తీసుకెళ్తాయో తెలియదని అన్నారు. తన దృష్టి సంగారెడ్డి అభివృద్ధిపైనే ఉంటుందని, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నందున మరింత నిధులను సంగారెడ్డికి తీసుకురావడానికి ప్రయత్నిస్తానని చెప్పారు. తన సినిమా షూటింగ్ ఉగాదికి ప్రారంభమవుతుందని, సంగారెడ్డికి చెందిన మొగిలయ్య 18 ఏళ్ల క్రితం రాసిన పాటను ప్రత్యేకంగా విడుదల చేస్తామని తెలిపారు.
PM Modi: భారత్ శాంతికి ప్రయత్నిస్తే.. పాకిస్తాన్ ప్రతీసారి ద్రోహం చేసింది..