Jagadish Reddy : కేంద్ర ప్రభుత్వాన్ని, ఎన్డీఎస్‌ఏ (NDSA) నివేదికను బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి జగదీష్ రెడ్డి తీవ్రంగా విమర్శించారు. ఆయన వరంగల్‌లో జరగబోయే బీఆర్‌ఎస్ రజతోత్సవ సభ ఏర్పాట్ల గురించి మీడియాతో మాట్లాడారు. ఈ నెల 27న జరగబోయే సభకు ఏర్పాట్లు పూర్తయ్యాయని తెలిపారు. మేము బీఆర్‌ఎస్ రజతోత్సవ సభగా ప్రకటించామని, కానీ ప్రజలు దీన్ని కాంగ్రెస్ పార్టీ పాలనపై వ్యతిరేకతగా చూస్తున్నారని జగదీష్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఈ సభ పార్టీ సభ మాత్రమే కాదు, ప్రజల అసంతృప్తికి అద్దం పట్టే మహాసభగా మారిందని అభిప్రాయపడ్డారు. ఇంత ఆదరణ ఏ పార్టీ సభకూ దక్కలేదని, గతంలో మా సభలు ఎంతగా విజయం సాధించాయో అందరికీ తెలిసిందే అన్నారు. ఇప్పుడు ఆ రికార్డులను మేమే తిరగరాస్తున్నామని ఆయన వివరించారు.
జగదీష్ రెడ్డి ఎన్డీఎస్‌ఏ నివేదికపై మండిపడ్డారు. కేసీఆర్‌ను దెబ్బ తీయడానికి కావాలనే ఈ నివేదికను రూపొందించారని ఆయన ఆరోపించారు. ఇది పూర్తిగా పని చేయని నివేదిక అని, శునకానందం, క్షణికానందం కోసం ఈ రిపోర్టును రూపొందించారని ధ్వజమెత్తారు. గుజరాత్‌లో నిర్మాణం పూర్తికాకముందే కూలిపోయిన నిర్మాణాల్లో 150 మంది మృతి చెందిన ఘటనను ఉదహరిస్తూ.. “అప్పుడు ఎన్డీఎస్‌ఏ ఎందుకు వెళ్లలేదు? కేవలం కాళేశ్వరం కోసమేనా ఈ సంస్థ పనిచేస్తుందా?” అని ప్రశ్నించారు. ఈ నివేదికను చెత్తబుట్టలో వేయడానికే పనికొస్తుందని ఆయన విమర్శించారు. మేడిగడ్డ, కాళేశ్వరం, సుందిళ్ల ప్రాజెక్టులపై వచ్చిన వ్యాఖ్యలన్నీ అర్థరహితమైనవని, కేంద్ర ప్రభుత్వ రాజకీయ దాడుల పాలిట ఈ నివేదిక మారిందని పేర్కొన్నారు.
Pahalgam Terror Attack: హఫీజ్ సయీద్ నేతృత్వంలోనే పహల్గామ్ దాడి.. నివేదిక వర్గాలు నిర్ధారణ!