పహల్గామ్ ఉగ్ర దాడి వెనుక ఉన్న కుట్రను కేంద్ర సంస్థలు వెలికితీస్తున్నాయి. 26/11 ముంబై దాడుల కుట్రదారుడు, లష్కరే తోయిబా చీఫ్ హఫీజ్ సయీద్ ఆధ్వర్యంలోనే పహల్గామ్ ఉగ్ర దాడి జరిగినట్లుగా భద్రతా సంస్థలు ఇక నిర్ధారణకు వచ్చినట్లు వర్గాలు పేర్కొన్నాయి.
పహల్గామ్ దాడి జరగగానే తామే ఈ దాడి చేసినట్లుగా ఉగ్రవాద సంస్థ ది రెసిస్టెన్స్ ఫ్రంట్ ప్రకటించింది. ఇది లష్కరే తోయిబాకు అనుబంధ సంస్థగా ఉంది. దీనికి హఫీజ్ సయీద్ ముఖ్య అనుచరుడైన సైఫుల్లా ఖలీద్ అలియాస్ సైఫుల్లా కసూరి నేతృత్వం వహిస్తున్నాడు. ప్రస్తుతం వీరిద్దరి ఆధ్వర్యంలోనే ఈ ఉగ్ర సంస్థలు నడుస్తున్నాయి. ఇద్దరి మాడ్యూల్ ప్రకారం పహల్గామ్ దాడి జరిగినట్లుగా భారత నిఘా సంస్థలు కనిపెట్టాయి. ఇక ఈ ఉగ్రవాద సంస్థలకు పాకిస్థాన్ సైన్యం, ఇంటర్-సర్వీసెస్ ఇంటెలిజెన్స్ (ఐఎస్ఐ) పూర్తి మద్దతు ఉంటుంది. సైద్ధాంతిక, లాజిస్టికల్ మరియు వ్యూహాత్మక మద్దతు ఇస్తుంటాయి.
ఇక స్థానిక ఉగ్రవాదుల మద్దతుతో బైసరన్ లోయలో లష్కరే తోయిబా దాడులకు పాల్పడినట్లుగా గుర్తించింది. ముందుగా అక్కడ గ్రౌండ్ వర్క్ కూడా చేసినట్లుగా అనుమానిస్తు్న్నారు. స్థానిక మద్దతుదారుల సహకారంతోనే ఈ ఉగ్ర దాడి జరినట్లుగా ఒక నిర్ధారణకు వచ్చారు. 2024, అక్టోబర్‌లో బూటా పత్రి దగ్గర జరిగిన ఉగ్ర దాడిలో కూడా ఈ పహల్గామ్‌లో పాల్గొన్నవారే ఉన్నట్లుగా గుర్తించింది. ఆ దాడిలో ఇద్దరు సైనికులతో పాటు నలుగురు సామాన్య పౌరులు చనిపోయారు. అదే నెలలో సోనామార్గ్‌లో సొరంగం నిర్మాణ కార్మికులపై జరిగిన ఉగ్రదాడిలో ఆరుగురు కార్మికులు, ఒక వైద్యుడు చనిపోయాడు. ఈ దాడిలో కూడా ఈ ఉగ్రవాదులే పాల్గొన్నట్టుగా కనిపెట్టారు. వీళ్లంతా లష్కరే తోయిబా కనుసన్నల్లో నడుచుకుంటున్నట్లుగా గుర్తించారు. పహల్గామ్ ఉగ్రవాదుల్లో విదేశీయులు కూడా ఉన్నట్లుగా అనుమానిస్తున్నారు.
ఇక మంగళవారం ఉగ్రదాడిలో పాల్గొన్న ముష్కరులు ఊహాచిత్రాలను బుధవారం విడుదల చేశారు. ముగ్గురు ఉగ్రవాదుల్లో పాకిస్థాన్‌కు చెందిన హషీమ్ ముసా అలియాస్ సులేమాన్, అలీ భాయ్ అలియాస్ తల్హా, మూడో వ్యక్తి స్థానిక నివాసి అబ్దుల్ హుస్సేన్ థోకర్‌గా గుర్తించారు. ఇక వీళ్ల సమాచారం అందిస్తే.. రూ.20లక్షల రివార్డ్ ఇస్తామని ఇప్పటికే భద్రతా దళాలు ప్రకటించాయి.
పహల్గామ్ ఉగ్ర దాడిలో 26 మంది చనిపోయారు. ఇందులో ఎక్కువగా కొత్తగా పెళ్లైన వారే ఉండడం విశేషం. అనేక మంది గాయాలు పాలయ్యారు. ప్రస్తుతం వారంతా కోలుకుంటున్నారు. ఇక ఈ ఘటనతో బాధితులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఇప్పటికీ ఆ ఘటనను నుంచి తేరుకోలేకపోతున్నారు. ప్రస్తుతం పాకిస్థాన్-భారత్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పాక్‌పై భారత్ కఠిన నిర్ణయాలు తీసుకుంటోంది.