టీమిండియా సీనియర్ పేసర్ మహమ్మద్ షమీకి ఐపీఎల్ ప్రాంచైజీ గుజరాత్ టైటాన్స్ భారీ షాక్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఐపీఎల్ 2025 మెగా వేలంలోకి షమీని వదిలేందుకు సిద్దమైందని సమాచారం. గుజరాత్ రిటైన్ లిస్టులో షమీ పేరు లేదని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. చీలమండ గాయం కారణంగా ఏడాదికి పైగా షమీ ఆటకు దూరమవడంతోనే గుజరాత్ మేనేజ్‌మెంట్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
మహహ్మద్ షమీ చీలమండ గాయంతో భారత జట్టుకు దూరమయ్యాడు. ఈ ఏడాదిలో ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు. వన్డే ప్రపంచకప్ 2023 ఫైనల్లో చివరిసారిగా ఆడాడు. అనంతరం విదేశాల్లో శస్త్ర చికిత్స చేయించుకున్నాడు. ఈ క్రమంలో ఐపీఎల్ 2024, టీ20 ప్రపంచకప్ 2024కు దూరమయ్యాడు. ప్రస్తుతం గాయం నుంచి పూర్తిగా కోలుకొని జట్టులోకి రీఎంట్రీ ఇచ్చేందుకు ప్రయత్నిస్తున్నాడు. ఇటీవలే ఫిట్‌నెస్ టెస్ట్‌లను కూడా క్లియర్ చేశాడు. అయితే షమీకి బీసీసీఐ సెలెక్టర్లు షాకిచ్చారు. దక్షిణాఫ్రికా టీ20 సిరీస్, ఆస్ట్రేలియాతో బోర్డర్-గవాస్కర్ ట్రోఫీకి ఎంపిక చేయలేదు.
Also Read: IND vs NZ: భారత్‌పై విజయం డబ్ల్యూటీసీ ఫైనల్ కంటే ఎక్కువ.. సౌథీ ఆసక్తికర వ్యాఖ్యలు!
ఇక చేసేది లేక బెంగాల్ తరఫున నాలుగో రౌండ్ రంజీ మ్యాచ్ ఆడేందుకు మహహ్మద్ షమీ సిద్దమయ్యాడు. ఏడాది కాలంగా క్రికెట్ ఆడని షమీని గుజరాత్ టైటాన్స్ కూడా పట్టించుకోలేదు. ఐపీఎల్ 2025 కోసం రిటైన్ చేసుకోకుండా.. వేలంలోకి వదిలేస్తోంది. ఒకవేళ రంజీ మ్యాచులో రాణిస్తే.. ఆర్‌టీఎమ్ ద్వారా తీసుకోవాలని చూస్తోందట. ఐపీఎల్ మెగా వేలం నవంబర్ 30న జరిగే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఇక అక్టోబర్ 31లోపు రిటెన్షన్ జాబితాలను ప్రాంఛైజీలు సమర్పించాల్సి ఉంది. శుభ్‌మన్ గిల్, రషీద్ ఖాన్, సాయి సుదర్శన్‌లను గుజరాత్ రిటైన్ చేసుకున్నట్లు తెలుస్తోంది. రవి బిష్ణోయ్, మయాంక్ యాదవ్, మార్కస్ స్టోయినిస్, రాహుల్ తెవాటియా, షారుఖ్ ఖాన్‌లలో ఎవరిని రిటైన్ చేసుకుంటుందో చూడాలి.