ఏప్రిల్ 6న జరిగే ఐపీఎల్ మ్యాచ్ షెడ్యూల్‌లో మార్పు చోటు చేసుకుంది. కోల్‌కతా నైట్ రైడర్స్, లక్నో సూపర్ గెయింట్స్ మధ్య ఏప్రిల్ 6న ఈడెన్ గార్డెన్స్‌లో జరగాల్సిన ఐపీఎల్ మ్యాచ్ రీషెడ్యూల్ అయ్యింది. ఏప్రిల్ 6న జరగాల్సిన మ్యాచ్ ఏప్రిల్ 8న నిర్వహిస్తున్నట్లు బీసీసీఐ ప్రకటించింది. ఏప్రిల్ 6న మ్యాచ్ నిర్వహణకు బెంగాల్ పోలీసుల నుంచి అనుమతి లభించ లేదు. ఏప్రిల్ 6న శ్రీరామ నవమి కావడంతో… బెంగాల్‌లో సుమారు 20 వేల చోట్ల భారీగా ర్యాలీలు తీసేందుకు బీజేపీ నేత సువేందు అధికారి ప్లాన్ చేశారు. దీంతో భద్రతాపరమైన సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉందని పోలీసులు తెలిపారు… స్టేడియం వద్ద సెక్యూరిటీ కల్పించలేం అని తేల్చిచెప్పేశారు.
బీసీసీఐ ప్రకటన కంటే ముందు ఈ మ్యాచ్ కోల్‌కతాలో కాకుండా గౌహతిలో జరుగుతుందనే పుకార్లు షికార్లు చేశాయి. కానీ బీసీసీఐ ఆ వదంతులకు చెక్ పెట్టింది. బెంగాల్ క్రికెట్ అసోసియేషన్, కోల్‌కతా ప్రభుత్వం కూడా ఈ పుకార్లను తోసిపుచ్చాయి. ఈ మ్యాచ్ తప్పకుండా కోల్‌కతాలోనే నిర్వహిస్తామని స్పష్టం చేశాయి. కాగా.. నిన్న (శుక్రవారం) చెన్నై సూపర్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య జరిగిన మ్యాచ్ సందర్భంగా బీసీసీఐ తన నిర్ణయాన్ని ప్రకటించింది. మ్యాచ్ వేదికలో ఎటువంటి మార్పు ఉండదని తేల్చ చెప్పేసింది. మ్యాచ్ తేదీలో మార్పు చేసింది. ఏప్రిల్ 8న మధ్యాహ్నం 3.30 గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభమవుతుంది.
READ MORE: Suitcase murder: “నా వల్ల కావడం లేదు అందుకే చంపేశా నాన్న”.. రాత్రంతా భార్య డెడ్‌బాడీతో ముచ్చట్లు..