తెలంగాణలో ఇక మీదట కక్ష సాధింపు రాజకీయాలు ఉండవా? అసెంబ్లీ వేదికగా ఆ ప్రకటన చేసి సీఎం రేవంత్‌రెడ్డి ఓ ప్రత్యేక సందేశం పంపారా? అసలు సభ సాక్షిగా ఆ ప్రకటన చేయడాన్ని ఎలా చూడాలి? రేవంత్‌రెడ్డి దూకుడు తగ్గించుకున్నారా? లేక వ్యూహం మార్చారా? ఆయన మాటల వెనక శ్లేషలు దాగున్నాయా? ఆ విషయమై జరుగుతున్న చర్చ ఏంటి? తెలంగాణ పాలిటిక్స్‌లో ఇక కక్ష సాధింపు చర్యలు ఉండవంటూ… సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో చేసిన కామెంట్స్ ఇప్పుడు గట్టి చర్చే మొదలైంది రాష్ట్ర రాజకీయ వర్గాల్లో. నిజంగానే రేవంత్ రెడ్డి కక్ష సాధింపు చర్యలకు దిగరా..? ఇన్నాళ్లు కేసులు పెట్టకుండా అందుకే ఉన్నారా..? పిసిసి అధ్యక్షుడిగా ఉన్నప్పటికంటే దూకుడు తగ్గించుకున్నారా..? లేదంటే… అసలు కాంగ్రెస్ అధిష్టానమే కళ్ళెం వేసిందా..? అంటూ రకరకాల ప్రశ్నలకు సమాధానాలు వెదుక్కునే పనిలో పనిలో ఉన్నాయి రాజకీయవర్గాలు. సభలో ఆయన చేసిన వ్యాఖ్యలపై… ఇంటా బయటా చర్చ జరుగుతోంది. ఇంతకీ ఏం జరిగిందంటే…. అసెంబ్లీలో కక్ష సాధింపు చర్యల గురించి కేటీఆర్ ప్రస్తావించగా… అసలు ఇప్పటి వరకు అలాంటి చర్యలకు దిగలేదని, కేసీఆర్ కుటుంబానికి చర్లపల్లి జైల్లో డబుల్ బెడ్ కట్టిస్తామని ఇచ్చిన హామీ ఇంకా నెరవేర్చలేదని అన్నారు సీఎం. సభలో ఆయన అలా కామెంట్స్ చేయడం వెనక వ్యూహం ఉందా..? అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర గడిచినా ఇప్పటి వరకు కేసీఆర్ కుటుంబం పై ఎలాంటి చర్యలు లేకపోవడాన్ని కక్ష సాధింపులు లేకపోవడంలో భాగంగానే చూడాల్నా అన్న టాక్ నడుస్తోంది. ఐతే రేవంత్ రెడ్డి చాలా సందర్భాల్లో… కేసీఆర్ కుటుంబంపై కేసులు ఊరికే పెట్టినవి కాదని అన్నారు. ఓ వైపు విచారణకి విద్యుత్ పై ఒక కమిషన్.. ఇరిగేషన్ పై మరో కమిషన్ వేశారు. ఇప్పటికే విద్యుత్ కొనుగోలుపై వేసిన కమిషన్ నివేదిక వచ్చింది. ఇక కాళేశ్వరం నివేదిక రావాల్సి ఉంది.
ఏదైనాసరే…చట్టానికి లోబడి చర్యలు ఉంటాయని రేవంత్ చెప్పారు కాబట్టి అందుకు అనుగుణంగా, ఆ ప్రకారమే ముందుకు వెళ్ళాలని భావిస్తున్నట్టు కనిపిస్తోందని అంటున్నారు. కేసులు పెట్టడం ఈజీ గానీ… కోర్టుల్లో నిలబెట్టుకోవడం కష్టం. అందుకే జాగ్రత్తగా ముందడుగు వేయాలని రేవంత్ భావిస్తున్నట్టు కనిపిస్తోందని అంటున్నారు. అసెంబ్లీలో రేవంత్ వ్యాఖ్యల్ని రెండు రకాలుగా చూస్తున్నారు పార్టీ నాయకులు. బీఆర్‌ఎస్ ముఖ్యుల్ని అరెస్ట్ చేసి కూడా సానుభూతి దొరక్కుండా చేయడం, వాళ్ళను భయంలోనే ఉంచి రాజకీయం చేయడం అన్న వ్యూహం కనిపిస్తోందని అంటున్నారు కొందరు. కేసీఆర్ తనను అక్రమంగా జైల్లో పెట్టినా… రేవంత్ కక్ష సాధింపు చర్యలకు పోకుండా పని చేస్తున్నారన్న క్రెడిట్ కొట్టేసే పనిలో రేవంత్ ఉన్నారన్నది ఇంకో వెర్షన్. కానీ పార్టీ క్యాడర్‌ని మాత్రం రేవంత్ వ్యాఖ్యలు నిరాశకు గురిచేశాయని చెప్పుకుంటున్నారు. ఎన్నికల సమయంలో ఓ వర్గం ప్రజలు కేసీఆర్ కుటుంబంపై కోపంతో కాంగ్రెస్ వెంట నడిచారు. కానీ ఇప్పుడు కేసులు ఉండవని చెప్పడంతో వాళ్లకు నిరాశగా ఉన్నట్టు ప్రచారం మొదలైంది. పదేళ్లు కేసీఆర్ హయాంలో కేసులు..జైళ్లు ఎదుర్కొన కాంగ్రెస్ క్యాడర్ కూడా రేవంత్ వ్యాఖ్యలతో డల్ అయ్యారన్న టాక్ మొదలైంది. కానీ… కాళేశ్వరం నివేదిక పై ప్రభుత్వం ఎలా వ్యవహరిస్తుందన్నది చూశాకగానీ… రేవంత్ మాటల్ని అర్ధం చేసుకోలేమంటున్నారు పరిశీలకులు.