ఐపీఎల్ 2025 ముందు మెగా వేలం జరగనున్న విషయం తెలిసిందే. వేలానికి సంబంధించి రిటెన్షన్ రూల్స్‌ను ఇటీవల బీసీసీఐ ప్రకటించింది. ఈసారి ఆరుగురి ఆటగాళ్లను రిటైన్ చేసుకునేందుకు ప్రాంచైజీలకు అవకాశం ఇచ్చింది. ప్రాంచైజీలు తమ రిటెన్షన్ లిస్ట్ సమర్పించేందుకు అక్టోబర్ 31 తుది గడువు. ఈ నేపథ్యంలో ఏ జట్టు ఎవరెవరిని రిటైన్ చేసుకుంటుంది?, ఎవరిని వదిలేస్తుంది? అనేది ఆసక్తికరంగా మారింది. అయితే లక్నో సూపర్ జెయింట్స్ (ఎల్‌ఎస్‌జీ) తన కెప్టెన్‌ను వదిలేసేందుకు సిద్దమైందట.
ఐపీఎల్ 2024 సీజన్‌లో లక్నో దారుణమైన ప్రదర్శన చేసిన సంగతి తెలిసిందే. లీగ్ దశలో హైదరాబాద్ మ్యాచ్ సందర్భంగా కెప్టెన్ కేఎల్ రాహుల్‌పై ఎల్‌ఎస్‌జీ ఓనర్ సంజీవ్ గోయెంకా అసహనం వ్యక్తం చేసిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఆ తర్వాత గోయెంకా అందుకు వివరణ ఇచ్చారు. ఆ మధ్య గోయెంకా, రాహుల్ కలిశారు కూడా. దాంతో అందరూ ఎల్‌ఎస్‌జీలోనే రాహుల్ ఉంటాడనుకున్నారు. తాజాగా ఎల్‌ఎస్‌జీ మెంటార్‌గా వచ్చిన టీమిండియా మాజీ పేసర్ జహీర్ ఖాన్.. ఓ నివేదికను సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. లక్నో రిటైన్ లిస్ట్‌లో రాహుల్ లేడట. అతడు మెగా వేలంలోకి వస్తాడని సమాచారం.
‘ఐపీఎల్ 2024లో జట్టు ప్రదర్శనపై ఎల్‌ఎస్‌జీ మేనేజ్‌మెంట్, మెంటార్ జహీర్ ఖాన్, కోచ్ జస్టిన్ లాంగర్ ప్రత్యేకంగా ఓ నివేదిక సిద్ధం చేశారు. గత సీజన్‌లో కేఎల్ రాహుల్ నాయకత్వంలో ప్లే ఆఫ్స్ చేరుకోవడంలో టీమ్ విఫలమైంది. బ్యాటర్‌గా జట్టు పరాజయాల్లో రాహుల్ పాత్ర ఉందని మేనేజ్‌మెంట్ భావిస్తోంది. మిడిల్ ఓవర్లలో చాలా నెమ్మదిగా ఆడి భారీ స్కోరుకు అడ్డుగా మారాడు. అందుకే అతడిని పక్కన పెట్టేందుకు ఎక్కువగా అవకాశాలు ఉన్నాయ్. ఇంపాక్ట్ రూల్‌తో మిగతా జట్లు భారీ స్కోర్లు చేస్తుంటే.. లక్నో మాత్రం వెనకబడిపోయింది. టాప్ ఆర్డర్‌లో ఎక్కువ బంతులు వృథా చేయడంతో మిగతా బ్యాటర్లపై ప్రభావం పడింది’ అని ఐపీఎల్ వర్గాలు తెలిపాయి. గత సీజన్‌లో రాహుల్ 14 మ్యాచుల్లో 520 పరుగులు చేశాడు. కానీ.. స్ట్రైక్‌రేట్ 136గా ఉంది.
Also Read: Chain Snatching: దారుణం.. చైన్ కోసం మహిళను రోడ్డుపై ఈడ్చుకెళ్లిన దొంగలు! (వీడియో)
జహీర్ ఖాన్ సిద్ధం చేసిన రిటైన్ లిస్ట్‌లో యువ ఆటగాళ్లకు అవకాశం దక్కనుందని తెలుస్తోంది. పేసర్ మయాంక్ యాదవ్‌ను ఎల్‌ఎస్‌జీ తీసుకోవడం ఖాయంగా కనిపిస్తోంది. గత సీజన్‌లో రాణించిన ఆయుష్ బదోని, మోసిన్ ఖాన్‌ను రిటైన్ చేసుకోనుందట. వీరిద్దరూ అన్‌క్యాప్‌డ్ ప్లేయర్లు కొనసాగే అవకాశం ఉంది. విండీస్ హిట్టర్ నికోలస్ పూరన్‌ను రిటైన్ చేసుకొని.. కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించే అవకాశం ఉందని సమాచారం. దీపక్ హుడా, దేవదత్ పడిక్కల్, డికాక్, స్టోయినిస్, కైల్ మేయర్స్, హేన్రి, నవీన్, మిశ్రాలు ఎల్‌ఎస్‌జీలో ఉన్నారు. వీరిలో ఎవరికీ అవకాశం దక్కుతుందో చూడాలి.