Investments In Stock Market: భారతీయ స్టాక్ మార్కెట్లో పెట్టుబడిదారుల సంఖ్య గణనీయంగా పెరిగిందని తాజా నివేదికలు వెల్లడిస్తున్నాయి. స్టాక్‌గ్రో, 1లాటిస్ సంస్థలు సంయుక్తంగా విడుదల చేసిన ఇన్వెస్టర్ బిహేవియర్ ఇండెక్స్ (IBI) 2025 ప్రకారం, సర్వే చేసిన భారతీయుల్లో 81% మంది స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెట్టారని తేలింది. RBI ఫైనాన్షియల్ లిటరసీ వీక్ 2025 లో భాగంగా నిర్వహించిన ఈ సర్వేలో 50,000 మంది పాల్గొని తమ పెట్టుబడి ప్రవర్తన, ప్రాధాన్యతల గురించి వెల్లడించారు.
ఇందులో ఆశ్చర్యపరిచే విషయమేమిటంటే.. 35 సంవత్సరాల లోపు ఉన్న యువ ఇన్వెస్టర్లలో 45% మంది సంప్రదాయ ఆదాయ మార్గాల కన్నా స్టాక్ మార్కెట్‌ను ప్రాధాన్యత ఇస్తున్నారని సర్వే వెల్లడించింది. దీని వెనుక పెరుగుతున్న ఆర్థిక అవగాహన, డిజిటల్ ఇన్వెస్ట్‌మెంట్ టూల్స్‌కు ఆన్‌లైన్ ద్వారా సులభంగా యాక్సెస్ లభించడం ప్రధాన కారణాలుగా పేర్కొనబడింది. అయితే, పెట్టుబడిదారుల సంఖ్య పెరిగినప్పటికీ ఆర్థిక అవగాహన లోపం ఒక ప్రధాన సవాలుగా మిగిలింది. 42% మంది స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెట్టకపోవడానికి అసలు కారణం వారికి తగిన జ్ఞానం లేకపోవడమే. అదే విధంగా 44% మంది పెట్టుబడిదారులు సరైన మార్గదర్శకత్వాన్ని కోరుకుంటున్నారని సర్వేలో వెల్లడైంది.
Read Also: IND vs PAK: భారత్, పాకిస్థాన్‌లను వేర్వేరు గ్రూపుల్లో వేయండి.. లేదా హాస్పిటల్ బిల్లులైన చెల్లించండి!
సమకాలీన పెట్టుబడిదారుల్లో 68% మంది ఆర్థిక విద్యను ఆన్‌లైన్ వనరుల ద్వారానే నేర్చుకుంటున్నారని, అలాగే కొత్తగా మార్కెట్‌లో అడుగుపెట్టి ప్రాతిపదికన పెట్టుబడులు చేసే వ్యక్తుల్లో సగం మంది నిజమైన పెట్టుబడికి ముందు వర్చువల్ ట్రేడింగ్ ద్వారా మార్కెట్‌ను అర్థం చేసుకుంటున్నారని నివేదిక వెల్లడించింది. ఇక ఈ విషయం సంబంధించి స్టాక్‌గ్రో వ్యవస్థాపకుడు, CEO అజయ్ లఖోతియా మాట్లాడుతూ.. ఇన్వెస్టర్ బిహేవియర్ ఇండెక్స్ 2025 భారత రిటైల్ పెట్టుబడిదారుల దృక్పథంలో సంచలనాత్మక మార్పును తెలియజేస్తోందని, యువత స్టాక్ మార్కెట్‌ను నమ్ముతుండటమే కాకుండా.. డిజిటల్ లెర్నింగ్ ప్లాట్‌ఫామ్‌లను ఎక్కువగా ఉపయోగించుకోవడం గమనార్హం అని తెలిపారు. అయితే, ఆర్థిక అవగాహన పెంపుదల ఇప్పటికీ అత్యవసర అంశంగా ఉందని, స్టాక్‌గ్రో (StockGro)లో పెట్టుబడిదారులను సుస్పష్టమైన పెట్టుబడి నిర్ణయాలు తీసుకునేందుకు SEBI రిజిస్టర్డ్ కన్సల్టెంట్ల సహాయంతో అవగాహన కల్పించేందుకు కట్టుబడి ఉన్నామని తెలిపారు. ఇది భవిష్యత్తులో బలమైన పెట్టుబడిదారుల వర్గాన్ని సృష్టించేందుకు దోహదపడుతుందని ఆయన అన్నారు.
Read Also: South Korea: దక్షిణ కొరియాలో కూలిన వంతెన.. ముగ్గురు కార్మికులు మృతి
మరోవైపు .పెట్టుబడిదారుల సంఖ్య పెరుగుతున్నప్పటికీ.. లింగ అసమతుల్యత ఇంకా ఒక ప్రధాన సమస్యగానే ఉంది. ఈ సర్వే ప్రకారం పెట్టుబడిదారులలో కేవలం 10.1% మంది మహిళలు మాత్రమే ఉన్నారు. కానీ, ప్రస్తుత పరిస్థితులను బట్టి 34% మంది మహిళలు రాబోయే సంవత్సరంలో స్టాక్ మార్కెట్లో తమ పెట్టుబడులను పెంచాలని యోచిస్తున్నట్లు తెలిపింది. సర్వేలో భాగంగా 51% మంది పెట్టుబడిదారులు మార్కెట్ పడిపోతుందనే భయంతో ఉన్నారని, అలాగే 36% మంది యాక్టివ్ ఇన్వెస్టర్లకు ఒక ఏడాదికి తక్కువ అనుభవమే ఉందని వెల్లడైంది. అలాగే 41% మంది కొత్త పెట్టుబడిదారులు తగిన మార్గదర్శకత లభిస్తే స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెట్టడానికి సిద్ధంగా ఉన్నారని ఈ నివేదిక తెలిపింది.