Hyderabad Cricketer Tilak Varma Says My Parents Crying after Maiden India Call Up: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో ముంబై ఇండియన్స్ తరఫున గత రెండు సీజన్లలో అదరగొట్టిన హైదరాబాద్ యువ క్రికెటర్ తిలక్ వర్మ భారత జట్టుకు ఎంపికైన విషయం తెలిసిందే. కొత్త చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ.. జులై 12 నుంచి ప్రాంరంభం కానున్న వెస్టిండీస్ పర్యటనలోని ఐదు టీ20 సిరీస్ కోసం అతడిని భారత జట్టులోకి తీసుకుంది. తిలక్ బ్యాట్‌తో బాదడంతో పాటు.. బంతితోనూ మాయ చేయగలడు. అయితే రాత్రి 8 గంటలకు తన చిన్ననాటి స్నేహితుడు ఫోన్ చేసి చెప్తేనే తాను భారత టీ20 జట్టుకు ఎంపికయ్యానని తెలిసిందని అతడు వెల్లడించాడు.
తాజాగా హైదరాబాద్ క్రికెటర్ తిలక్ వర్మ మాట్లాడుతూ… ‘ప్రస్తుతం దులీప్ ట్రోఫీలో ఆడుతున్నా. పగలు న ఫోన్ స్విచ్ఛాఫ్ ఉంటోంది. రాత్రి 8 గంటల సమయంలో నా చిన్ననాటి స్నేహితుడు ఫోన్ చేసి.. భారత జట్టుకి ఎంపికయ్యావని చెప్పాడు. అప్పుడే విషయం నాకు తెలిసింది. చాలా సంతోషించా. టీమిండియాకు ఎంపికయ్యానని తెలిసి మా అమ్మా-నాన్న కన్నీళ్లు పెట్టుకున్నారు. వీడియో కాల్‌లో మాట్లాడితే చాలా భావోద్వేగానికి గురయ్యారు. నా కోచ్ సలాం బయాష్ కూడా భావోద్వేగానికి గురయ్యారు. వచ్చిన అవకాశాన్ని బాగా సద్వినియోగం చేసుకోవాలని సూచించారు’ అని తెలిపాడు.
భారత జట్టులో చోటు దక్కించుకోవడం నాకు చాలాచాలా పెద్ద విషయం. అయితే ఇప్పుడు మాత్రం నిద్రలో కూడా దులీప్ ట్రోఫీ మ్యాచ్ గురించే ఆలోచిస్తా. జాతీయ జట్టుకు ఎంపికయ్యాను కాబట్టి మరింత ఆత్మ విశ్వాసంతో ఆడతా. చిన్నప్పటి నుంచి తెల్ల బంతి కంటే ఎర్ర బంతి క్రికెట్ ఎక్కువగా ఆడాను. ఎర్ర బంతి మ్యాచ్‌లోనే మన నైపుణ్యాలకు పరీక్ష ఎదురవుతుందని కోచ్‌లు ఎపుడూ చెప్పేవారు. తెల్ల బంతి క్రికెట్ మానసిక దృక్పథానికి సంబంధించింది. కానీ ఎర్ర బంతి క్రికెట్లో సవాళ్లు ఎదురవుతాయి. అందుకే దులీప్ ట్రోఫీలో ఉత్తమ ప్రదర్శన చేసేందుకు ప్రయత్నిస్తున్నా’ అని తిలక్ వర్మ చెప్పుకొచ్చాడు.
‘ఏ పరిస్థితుల్లోనైనా నాకు నేను మద్దతుగా ఉంటా. మెదడులో స్పష్టత ఉండేలా చూసుకుంటా. చివరి ఓవర్లలో కీరన్ పోలార్డ్ ముంబై ఇండియన్స్ జట్టుకి కీలకంగా ఉండేవాడు. ప్రశాంతంగా ఉంటూ తర్వాతి బంతిపై ధ్యాస పెట్టమని నాకు చెప్తుంటాడు. పోలార్డ్ సలహాలతో మంచి ఫలితాలు వస్తున్నాయి. భారత జట్టులో బాగా రాణించేందుకు ప్రయత్నిస్తా’ అని తిలక్ వర్మ ధీమా వ్యక్తం చేశాడు.
Also Read: World Cup 2023 Qualifiers: స్కాట్లాండ్‌పై సంచలన విజయం.. వన్డే ప్రపంచకప్‌కు నెదర్లాండ్స్ అర్హత!