Champions Trophy 2025 Update: వచ్చే ఏడాది పాకిస్థాన్ వేదికగా ఛాంపియన్స్ ట్రోఫీ 2025 జరగనుంది. ఐసీసీకి పీసీబీ పంపిన షెడ్యూల్ ప్రకారం.. టోర్నీ తొలి మ్యాచ్ ఫిబ్రవరి 19న, ఫైనల్ మ్యాచ్ మార్చి 9న జరగనుంది. లాహోర్, రావల్పిండి, కరాచీలను వేదికలుగా ఎంపిక చేశారు. ఛాంపియన్స్ ట్రోఫీకి సంబంధించిన అధికారిక షెడ్యూల్‌ను ఇంకా ప్రకటించాల్సి ఉంది. అయితే భద్రతా కారణాల దృష్ట్యా పాకిస్తాన్‌కు టీమిండియా వెళ్లేది లేదంటూ కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసిన సంగతి తెలిసిందే.
తాము పాకిస్తాన్‌కు రామని, హైబ్రిడ్ మోడల్‌లో టోర్నీని నిర్వహించాలని ఐసీసీని బీసీసీఐ కోరింది. దాంతో భారత్ ఆడే మ్యాచ్‌లతో పాటు.. టీమిండియా సెమీస్, ఫైనల్‌కు చేరుకుంటే వేదికలు కూడా మారిపోతాయని సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొట్టాయి. ఆ వార్తలను పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) ఇటీవల కొట్టిపడేసింది. అలాంటి ఆలోచన తాము చేయడం లేదంటూ వెల్లడించింది. తాజాగా మరో ఆఫర్‌తో బీసీసీఐకి ముందుకు పీసీబీ వచ్చింది.
Also Read: Sarfaraz-Pant: భాయ్ వెనక్కి వెళ్లిపో.. చిన్నపిల్లాడిలా గంతులేసిన సర్ఫరాజ్! నవ్వుకుండా ఉండలేరు
ఓ స్పోర్ట్స్ ఛానెల్ కథనం ప్రకారం.. భద్రతా కారణాల వల్ల పాకిస్తాన్‌లో భారత జట్టు ఉండటానికి ఇష్టపడకపోతే, ప్రతి మ్యాచ్ ఆడిన తర్వాత తిరిగి భారత్‌కు టీమ్ వెళ్లొచ్చని బీసీసీఐకి పీసీబీ ఓ లేఖ రాసిందట. ఛాంపియన్స్ ట్రోఫీ మ్యాచ్ అనంతరం న్యూ ఢిల్లీ లేదా చండీగఢ్‌కు తిరిగి వెళ్లేలా ఏర్పాట్లను చేస్తామని ప్రతిపాదించిందట. భారత జట్టు న్యూ ఢిల్లీ లేదా మొహాలీలో క్యాంప్‌ను ఏర్పాటు చేసుకోవచ్చని, మ్యాచ్‌ల కోసం లాహోర్‌కు వెళ్లేందుకు చార్టర్డ్ ఫ్లైట్‌లను ఏర్పాటు చేస్తామని తెలిపిందట. ఇటీవల భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ పాకిస్తాన్ పర్యటన వెళ్లగా.. ఛాంపియన్స్ ట్రోఫీ అంశం పలుమార్లు ప్రస్తావనకు వచ్చిందని పేర్కొంది.