దేశ రాజధాని ఢిల్లీని కాలుష్యం తీవ్రంగా వేధిస్తోంది. మనుషులు కూడా కనిపించలేనంతగా పొగ మంచు కప్పేసింది. దీంతో కేంద్ర వాతావరణ శాఖ అప్రమత్తం అయింది. తాజాగా ఐఎండీ ఢిల్లీకి రెడ్ అలర్ట్ జారీ చేసింది. రోడ్డు, రైలు, వాయు మార్గాల్లో రాకపోకలకు అంతరాయం ఏర్పడుతుందని తెలిపింది. దీంతో ఢిల్లీ విమానాశ్రయంలో 150కి పైగా విమాన సర్వీసులు రద్దయ్యాయి. మరో 200 సర్వీసుల్లో జాప్యం చోటుచేసుకుంది. కాలుష్యంగా కారణంగా అంతరాయాలు కొనసాగుతాయని ఢిల్లీ ఎయిర్‌పోర్ట్ వెల్లడించింది.
ఇది కూడా చదవండి: Sudha Murty: దయచేసి డీప్‌ఫేక్‌ను నమ్మొద్దు.. వైరల్ వీడియోపై సుధామూర్తి వినతి
కాలుష్య నివారణ కోసం ఢిల్లీ ప్రభుత్వం కఠిన ఆంక్షలు కొనసాగిస్తోంది. పాత వాహనాలపై నిషేధం విధించింది. ఇక నో పొల్యూషన్ సర్టిఫికెట్ లేని వాహనాలకు పెట్రోల్, డీజిల్ నిషేధం కొనసాగుతుంది. ఇతర రాష్ట్రాల నుంచి వాహనాలు రాకుండా టోల్ ప్లాజాలు కూడా మూసేశారు. అయినా కూడా కాలుష్యం కంట్రోల్ కావడం లేదు. ఢిల్లీ చుట్టు ప్రాంతాలన్నీ కూడా దట్టమైన పొగ మంచుతో కప్పేశాయి. ఎదురెదురు మనుషులు కూడా కనపడని పరిస్థితి.. వాహనాలు కనబడకపోవడంతో ప్రమాదాలు కూడా చోటుచేసుకుంటున్నాయి. అధికారులు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా.. పరిస్థితుల్లో అయితే మార్పు రావడం లేదు. ఢిల్లీ వాసులు నరకం అనుభవిస్తున్నారు. పిల్లలు, వృద్ధులు అనారోగ్యానికి గురవుతున్నారు.
ఇది కూడా చదవండి: Trump: ట్రంప్ మరో షాకింగ్ నిర్ణయం.. గ్రీన్‌కార్డ్ లాటరీ నిలిపేసినట్లు ప్రకటన