TDP: ఏపీలో టీడీపీ-జనసేన-బీజేపీ మధ్య పొత్తు ఏర్పడిన నేపథ్యంలో, ప్రతి ఒక్కరికీ టికెట్ కేటాయించలేక ఈ మూడు పార్టీలు అసంతృప్త జ్వాలలను ఎదుర్కొంటున్నాయి. అనంతపురం అర్బన్ టీడీపీలో టికెట్ల కేటాయింపుపై అసంతృప్తి జ్వాలలు భగ్గుమన్నాయి. అనంతపురం అర్బన్ టిక్కెట్‌ను దగ్గుబాటి ప్రసాద్‌కు కేటాయించగా, టీడీపీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే వైకుంఠం ప్రభాకర్ చౌదరికి చంద్రబాబు టికెట్ కేటాయించలేదు. చంద్రబాబుకు వ్యతిరేకంగా ప్రభాకర్ చౌదరి వర్గీయులు నిరసనకు దిగారు. డబ్బులకు టికెట్లు అమ్ముకున్నారని ప్రభాకర్ చౌదరి వర్గీయులు ఆరోపించారు. ప్రభాకర్ చౌదరి వర్గీయులు టీడీపీ అధినేత చంద్రబాబు ఫ్లెక్సీలు చించేసి దహనం చేశారు. చంద్రబాబు, లోకేష్‌లకు వ్యతిరేకంగా టీడీపీ నేతలు నినాదాలు చేశారు. కరపత్రాలు, ఫ్లెక్సీలు దగ్ధం చేసారు.
Read Also: Kimidi Nagarjuna: టీడీపీకీ బిగ్ షాక్.. చీపురుపల్లిలో కిమిడి నాగార్జున రాజీనామా
ఈ స్థానం నుంచి టికెట్ ఆశించిన ప్రభాకర్ చౌదరి వర్గీయులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ అనంతపురం పట్టణంలో ఉన్న టీడీపీ కార్యాలయం తలుపులను బద్దలుకొట్టి లోనికి ప్రవేశించారు. ఫర్నిచర్‌ను , టీడీపీ జెండాను, చంద్రబాబు ఫ్లెక్సీలను బయటకు తీసుకువచ్చి దహనం చేశారు. చంద్రబాబు డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ప్రభాకర్ చౌదరి మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబు ఇలాంటి నిర్ణయం తీసుకుంటారని కలలో కూడా అనుకోలేదన్నారు. పార్టీకోసం అహర్నిశలు పనిచేసిన నాయకులకు తగిని గుర్తింపు లేకుంటే పార్టీ మనుగడ కష్టమని ఆగ్రహం వ్యక్తం చేశారు. తన భవిష్యత్ కార్యక్రమాన్ని శనివారం పార్టీనాయకులు, కార్యకర్తలతో సమావేశం నిర్వహించి తదుపరి నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు.