Harish Rao: బీఆర్ఎస్ నేతలు పార్టీని వీడుతుండటంపై మాజీ మంత్రి హరీష్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. పార్టీలు మారే వారు పవర్ బ్రోకర్లని హరీష్ వ్యాఖ్యానించారు. కొంత మంది రాజకీయ అవకాశవాదులు, పవర్ బ్రోకర్లు పార్టీని విడిచిపోతున్నారని అన్నారు. ఇదేం పార్టీకి కొత్తకాదు.. తెలంగాణ ఉద్యమం మొదలుపెట్టినప్పుడు పట్టుమని 10 మంది కూడా పార్టీలో లేరని.. అయినా తెలంగాణ తెచ్చి కేసీఆర్ చూపెట్టారన్నారు. ఆనాడు ఉద్యమ సమయంలో కేసీఆర్ పక్కన ఉన్న నాయకులను కాంగ్రెస్ వాళ్లు ఇలాగే కొన్నారని ఆయన విమర్శించారు. నాయకులను కాంగ్రెస్ కొనవచ్చు కానీ ఉద్యమకారులను కొనలేరు, కార్యకర్తలను కొనలేరన్నారు.
Read Also: BRS KTR: కష్ట కాలంలో కేకే, కడియం పార్టీ వదిలి వెళుతున్నారు..! కేటీఆర్ కీలక వ్యాఖ్యలు
మధ్యలో పార్టీలోకి వచ్చినవాళ్ళు పార్టీలో నుంచి వెళ్లిపోతున్నారని హరీష్ రావు పేర్కొన్నారు. పార్టీలో నుంచి వెళ్లిపోయిన వారిని రేపు కాళ్లు మొక్కినా మళ్లీ పార్టీలోకి తీసుకోవద్దని పార్టీ నిర్ణయించిందన్నారు. కష్ట కాలంలో పార్టీకి ద్రోహం చేస్తే కన్నతల్లికి ద్రోహం చేసినట్టేనని ఆయన చెప్పుకొచ్చారు. ఇది ఆకులు రాలే కాలం…కొత్త చిగురు మళ్ళీ పార్టీలోకి వస్తుందని హరీష్ స్పష్టం చేశారు. ఇటీవల చాలా మంది బీఆర్ఎస్ కీలక నేతలు పార్టీని వీడి కాంగ్రెస్లో చేరుతున్న సంగతి తెలిసిందే.