తెలంగాణలో రాజకీయాలు హాట్ టాపిక్ గా మారాయి. గత కొంత కాలంగా బీఆర్ఎస్ లో అతర్గత వ్యవహారాలు చర్చనీయాంశంగా మారిన విషయం తెలిసిందే. ముఖ్యంగా కల్వకుంట్ల కవిత పార్టీకి వ్యతిరేకంగా పనిచేస్తున్న తీరుపై ఆపార్టీ నాయకులు, కార్యకర్తలు విమర్శలు గుప్పిస్తున్నారు. ఇటీవల కాళేశ్వరం ప్రాజెక్ట్ విషయంలో హరీష్ రావు అవినీతికి పాల్పడ్డాడని బహిరంగంగానే బయటపెట్టింది కవిత. అంతేకాదు సంతోష్ రావు కూడా కుట్రలు పన్నుతున్నాడని తెలిపింది. దీంతో ఒక్కసారిగా పొలిటికల్ హీట్ పెరిగింది. దీంతో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కవితను పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. ఆ తర్వాత కవిత పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి, ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసింది.
ఆ సమయంలో హరీష్ రావు లండన్ పర్యటనలో ఉన్నారు. కాగా నేడు విదేశీ పర్యటన ముగించుకుని హైదరాబాద్ చేరుకున్నారు మాజీమంత్రి హరీష్ రావు. ఈ సందర్భంగా కవిత వ్యాఖ్యలపై హరీష్ తొలిసారి స్పందించారు. శంషాబాద్ లో హరీశ్ రావు మాట్లాడుతూ.. ఇటీవల కొన్ని రాజకీయ పార్టీల నాయకులు తనపై కావాలనే దుష్ప్రచారం చేస్తున్నారు అని తెలిపాడు. ఆ ప్రచారాన్నే కవిత మరోసారి మాట్లాడారు అని అన్నారు. నాపై చేసిన వ్యాఖ్యలను ఆమె విజ్ఞతకే వదిలేస్తున్నానని అన్నారు.
Also Read:Nag Ashwin : ప్రధాని మోడీకి డైరెక్టర్ నాగ్ అశ్విన్ సూచన.. అలా చేయాలంట
నా జీవితం తెరిచిన పుస్తకం.. తెలంగాణ ఉద్యమం లో నా పాత్ర ఏమిటో అందరికి తెలుసు.. క్రమశిక్షణ గల బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తగా కేసీఆర్ నాయకత్వంలో రెండున్నర దశాబ్దాలుగా పనిచేశాను. తెలంగాణ ఉద్యమంలో అలుపెరుగని పోరాటం చేసి స్వరాష్ట్రాన్ని సిద్ధించుకున్నాము. ఎవరో అబద్ధాలు మాట్లాడినంత మాత్రాన అవి నిజాలు అయిపోవు అని తెలిపారు. బీఆర్ఎస్ మళ్లీ అధికారంలోకి వచ్చేలా కృషి చేస్తామని అన్నారు. ప్రజలు పడుతున్న కష్టాలను తొలగించి కలిసి కట్టుగా ముందుకు సాగుతాం అని తెలిపారు.