ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మాజీ మంత్రి హరీష్ రావు బహిరంగ లేఖ రాశారు. సార్వత్రిక ఎన్నికల సమయంలో వరంగల్ రైతు డిక్లరేషన్ పేరిట మీరు అనేక హామీలను ఇచ్చారని.. అందులో రూ.2 లక్షల రుణమాఫీ అంతంత మాత్రమే పూర్తి చేశారని పేర్కొన్నారు. రైతు భరోసా పెట్టుబడి సాయానికి కోతలు పెట్టారని ఆరోపించారు. సన్నవడ్లకు మీరు ఇస్తానన్న బోనస్ డబ్బులను బోగస్ అన్నట్లుగానే ఎగవేస్తున్నారని హరీష్ రావు లేఖలో పేర్కొన్నారు. మీ బోనస్ హామీ ఒక బోగస్ హామీగా మారిపోయిందని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 8,64,000 మెట్రిక్ టన్నుల ధాన్యానికి సంబంధిచిన రూ.432 కోట్ల బోనస్ చెల్లింపులు పెండింగ్ లోనే ఉన్నాయని తెలిపారు. వరి ధాన్యం కొనుగోలు నిలిపివేసి దాదాపు 50 రోజులు గడిచిపోతున్నాయి.. కానీ ఇంత వరకు రైతుల ఖాతాల్లో బోనస్ డబ్బలు జమ కాలేదన్నారు. రెండో పంటకు సిద్ధం కావాల్సిన రైతులు బోనస్ డబ్బుల కోసం ప్రభుత్వ అధికారుల చుట్టూ తిరిగాల్సిన పరిస్థితి దాపురించదని దుయ్యబట్టారు.
Read Also: Thandel : అదరగొడుతున్న నాగ చైతన్య.. బుకింగ్స్ లో దుమ్ము లేపుతున్న “తండేల్”
నిన్నటికి నిన్న మహబూబ్ నగర్ జిల్లాలో ముచ్చింతల రైతులు తమ వడ్లు అమ్మి రెండు నెలలు అయినా ప్రభుత్వం బోనస్ చెల్లించడం లేదంటూ జిల్లా కలెక్టరును కలిస్తే బోనస్ డబ్బులు పెండింగ్‌లో ఉన్నది నిజమే.. ప్రభుత్వం విడుదల ఆలస్యం అవుతుందని సమాధానం ఇచ్చారని అన్నారు. ప్రభుత్వాన్ని నమ్మి ధాన్యాన్ని విక్రయిస్తే, తమను ప్రభుత్వం మోసం చేసిందని రైతులు ఆందోళన చెందుతున్నారని హరీష్ రావు లేఖలో తెలిపారు. వరంగల్ రైతు డిక్లరేషన్ అబద్ధమా..? మీరిచ్చిన బాండ్ పేపర్ బూటకమా..? సమాధానం చెప్పాలని కోరారు. కేసీఆర్ పాలనలో రైతులంతా గుండె ధైర్యంతో వ్యవసాయాన్ని పండగలా చేశారని తెలిపారు. కానీ మీ పాలనలో వ్యవసాయం దండగలా మారి రైతు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని హరీష్ రావు ఆరోపించారు. రైతులు పడుతున్న ఇబ్బందులను చూసి వారి పక్షాన తక్షణమే హామీలు అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నట్లు హరీష్ రావు లేఖలో పేర్కొన్నారు.
Read Also: Congress: తమ ఓటమి బాధ కన్నా, ఆప్ ఓటమితో కాంగ్రెస్ ఆనందం.. కారణం ఏంటంటే…
కాంగ్రెస్ పాలనపై తీవ్ర విమర్శలు..
కాంగ్రెస్ పార్టీ తవ్వుకున్న గ్యారెంటీల గోతిలో తానే సమాధి అవుతున్నదని హరీస్ రావు విమర్శించారు. ఇక్కడి గ్యారెంటీల వైఫల్యం హర్యానా, మహారాష్ట్ర, ఢిల్లీలో ఎఫెక్ట్ పడిందని తెలిపారు. తెలంగాణలో కూడా కాంగ్రెస్ పార్టీని గాల్లో కలపడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని పేర్కొన్నారు. బీఆర్ఎస్ పార్టీది జగమంత పాలన.. కాంగ్రెస్ పార్టీది సగమంత పాలన అని విమర్శించారు.. తమది అసలు పాలన మీది కోసరు పాలన అని అన్నారు. సంక్షేమం, సంపూర్ణం, సంతోషం, సంతృప్తి ఇది బీఆర్ఎస్ విధానమని తెలిపారు. సంక్షోభం, అసంపూర్ణం, అసంతృప్తి, అసహనం ఇది కాంగ్రెస్ విధానం అని దుయ్యబట్టారు.