Congress: ఢిల్లీ అసెంబ్లీలో కాంగ్రెస్ ఘోరంగా ఓడిపోయింది. 70 అసెంబ్లీ స్థానాలు ఉన్న ఢిల్లీలో ఒక్కటంటే ఒక్క స్థానంలో కూడా కాంగ్రెస్ గెలుపొంద లేకపోయింది. 67 చోట్ల ఏకంగా కాంగ్రెస్ డిపాజిట్ కోల్పోయిందంటే, ఆ పార్టీ పరిస్థితి ఏంటో అర్థమవుతోంది. 1998 నుంచి 2013 వరకు ఢిల్లీని ఏలిన కాంగ్రెస్, గత మూడు పర్యాయాలుగా కేవలం ‘సున్నా’ స్థానాలకు మాత్రమే పరిమితమైంది. ఢిల్లీ ఎన్నికల్లో 70 సీట్లకు బీజేపీ 48, ఆప్ 22 చోట్ల గెలుపొందాయి. అయితే, చాలా చోట్ల ఆప్ గెలుపుని కాంగ్రెస్ అడ్డుకుంది.
హర్యానాకి ఢిల్లీతో ప్రతీకారం.
తాను ఓడిన బాధ కన్నా, ప్రస్తుతం ఆప్ ఓటమి పైనే కాంగ్రెస్ సంతోషంగా ఉందని తెలుస్తోంది. ఎందుకంటే పలు సందర్భాల్లో కాంగ్రెస్ స్థానం కోసం ఆప్ గట్టిగా కృషి చేస్తోంది. కాంగ్రెస్ పెద్దరికాన్ని అడుగడుగునా ఆప్, అరవింద్ కేజ్రీవాల్ ప్రశ్నించారు. ఈ నేపథ్యంలో ఢిల్లీలో ఓడిపోయినా, ఆప్‌కి గుణపాఠం చెప్పాలని కాంగ్రెస్ భావించింది. దీంతోనే పొత్తుకు ఆ పార్టీ ఒప్పుకోలేదు. దీనికి ముందు హర్యానా ఎన్నికల సమయంలో కేజ్రీవాల్ కాంగ్రెస్‌తో పొత్తుకు నిరాకరించి, అన్ని అసెంబ్లీ స్థానాల్లో ఆప్‌ని పోటీకి దింపాడు. ఫలితంగా కాంగ్రెస్ మరోసారి బీజేపీ చేతిలో ఓడిపోయింది. ఇప్పుడు ఢిల్లీ ఎన్నికల్లో ఆప్‌కి రిటర్న్ గిఫ్ట్ ఇచ్చింది.
ఆప్ ఎదుగుదల కాంగ్రెస్‌కి ప్రమాదం:
ఆప్ నెమ్మదిగా బలపడటం కాంగ్రెస్‌కి ఎప్పటికైనా ముప్పే అని ఆ పార్టీ నేతలు భావిస్తున్నారు. ముఖ్యంగా గోవా, గుజరాత్, పంజాబ్ రాష్ట్రాల్లో కాంగ్రెస్‌కి ఆప్ చెక్ పెడుతోంది. కాంగ్రెస్ స్థానాన్ని ఆప్ ఆక్రమించాలని ప్రయత్నిస్తోంది. మరోవైపు ఇతర రాష్ట్రాల్లో కూడా ఇదే తరహా రాజకీయాలను ఆప్ చేస్తోంది. ఫలితంగా కాంగ్రెస్ పునరాలోచనలో పడ్డాయి. ముఖ్యం ఢిల్లీలో ఆప్ మళ్లీ గెలిస్తే తమ ఉనికికే ప్రమాదం వస్తుందని జాతీయ పార్టీ భావించి ఉంటుంది. ఈసారి ఆప్ ఓడిపోతే, ఇతర రాష్ట్రాల్లో కూడా దాని పట్టు తగ్గుతుందని కాంగ్రెస్ భావించి ఉండొచ్చు. దీని కారణంగానే ఢిల్లీ ఎన్నికల సమయంలో రాహుల్ గాంధీతో సహా కాంగ్రెస్ నేతలు అరవింద్ కేజ్రీవాల్‌పై ఆరోపణలు గుప్పించారు.
ఇప్పుడు కాకున్నా, ఆప్ వైభవాన్ని కోల్పోతే మళ్లీ కాంగ్రెస్‌కి పునర్‌వైభవం వస్తుందని హస్తం నేతలు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఢిల్లీ ఎన్నికల్లో ప్రధాన ప్రత్యర్థి బీజేపీని కాదని, ఆప్ ఓటమికి కాంగ్రెస్ ఎక్కువగా కృషి చేసింది. ఢిల్లీలో పలు నియోజకవర్గాల్లో కాంగ్రెస్‌కి వచ్చిన ఓట్లు బీజేపీ అభ్యర్థి గెలుపు మెజారిటీ కన్నా ఎక్కువగా ఉన్నాయి. దీంతో ఆప్-కాంగ్రెస్ కలిసి పోటీ చేస్తే ఫలితాలు వేరే విధంగా ఉండేవని ఉద్ధవ్ ఠాక్రే శివసేన నేత సంజయ్ రౌత్ అన్నారు. చాలా ప్రాంతాల్లో కాంగ్రెస్ ఆప్ ఓట్లకు గండికొట్టింది.
గత రెండు సార్లు కాంగ్రెస్ మద్దతుదారులు ఆప్‌కి ఓటేశారు. ఇలాగే వదిలేస్తే తమ ఓటర్లు ఆప్‌ని ప్రత్యామ్నాయంగా భావించే అవకాశం ఉంటుందనే భయాలు కాంగ్రెస్‌లో ఉన్నాయి. ఇది అన్ని రాష్ట్రాల్లో రిపీట్ అయితే మొదటికే మోసం వస్తుంది. ఈ నేపథ్యంలోనే ఢిల్లీ ఎన్నికల్లో ఓడిపోయినా, ఒంటరిపోరుకే కాంగ్రెస్ మద్దతు ఇచ్చింది. నిజానికి 2013 నుంచి 2025 వరకు కాంగ్రెస్ ఓటింగ్ శాతం దారుణంగా పడిపోయింది. 2013లో 24.6 శాతం ఉంటే, 2020లో 4.3 శాతం, 2025లో 6.4 శాతంగా ఉంది. నిజానికి గతంలో పోలిస్తే ఈసారి 2 శాతం ఓట్లను కాంగ్రెస్ పెంచుకుంది.
తగ్గనున్న ఆప్ డామినేషన్:
లోక్‌సభ ఎన్నికల ముందు ఇండియా కూటమిలో ఆప్, కాంగ్రెస్ మిత్రపక్షాలుగా ఉన్నాయి. ఢిల్లీలోని 07 ఎంపీ స్థానాల్లో ఇరు పార్టీలు కలిసి పోటీచేసినప్పటికీ బీజేపీ అన్నింటికి క్లీన్ స్వీప్ చేసింది. మరోవైపు, ఇండియా కూటమిలో పెద్దన్నగా ఉండాలనుకుంటున్న కాంగ్రెస్‌కి ఆప్ నుంచి ప్రతిఘటన ఎదురవుతోంది. ఇటీవల ఢిల్లీ ఎన్నికల సమయంలో కూడా ఇండియా కూటమి పార్టీలైన సమాజ్‌వాదీ, తృణమూల్ కాంగ్రెస్ వంటివి కాంగ్రెస్‌ని కాదని ఆప్‌కి మద్దతు ఇచ్చాయి. ఈ పరిణామాలు కాంగ్రెస్‌కి రుచించలేదు. ఢిల్లీలో ఆప్ ఓడితే, కేజ్రీవాల్ పొగరు అణిచేయవచ్చని కాంగ్రెస్ అనుకుంటుంది.