Hamas: గాజా యుద్ధం ముగిసే వరకు ఇజ్రాయిల్ బందీలు-ఖైదీల మార్పిడి ఒప్పందం ఉండదని హమాస్ యాక్టింగ్ గాజా చీఫ్ ఖలీల్ అల్ హయ్యా బుధవారం అల్ అక్సా టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించారు. ‘‘యుద్ధం ముగియకుండా బందీల మార్పిడి జరగదు’’ అని స్పష్టం చేశారు. ఇజ్రాయిల్ దుకూడు ముగియకుంటే, హమాస్ బందీలను ఎందుకు తిరిగి పంపుతుంది..? అని ప్రశ్నించారు. యుద్ధం కొనసాగుతున్న సమయంలో, తెలివైన వ్యక్తి తన వద్ద ఉన్న కీలకమైన బందీలను ఎందుకు పంపుతాడు..? అని అన్నారు.
Read Also: AUS vs IND: భారత్‌ను అడ్డుకోవడం కష్టమే.. ఆస్ట్రేలియాకు ఆడమ్ హెచ్చరికలు!
ఖతార్, ఈజిప్ట్ మధ్యవర్తులతో చర్చలలో హమాస్ తరుపున హయ్యా నాయకత్వం వహించారు. ఒప్పందం కుదరకపోవడంపై ఇజ్రాయిల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూని నిందించారు. చర్చల్ని పునరుద్ధరించడానికి కొన్ని దేశాలు, మధ్యవర్తులు ప్రయత్నాలు చేశారు. ఈ యుద్ధం ముగించడానికి ఇజ్రాయిల్ నుంచి సరైన మద్దతు లేదని చెప్పారు. నెతన్యాహూ చర్చల్ని అణగదొక్కుతున్నారని చెప్పారు.
అంతకుముందు మంగళవారం రోజు ఇజ్రాయిల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూ మాట్లాడుతూ.. యుద్ధం ముగిసిన తర్వాత పాలస్తీనా ఎన్‌క్లేవ్‌ని హమాస్ పాలించదని, ఆ సంస్థను ఇజ్రాయిల్ నాశనం చేసిందని చెప్పారు. గాజాలో ఉన్న తమ 101 మంది ఇజ్రాయిల్ బందీలను తీసుకువస్తే, వారికి 5 మిలియన్ డాలర్ల(సుమారుగా రూ.37 కోట్లు)ను ఇస్తామని నెతన్యాహూ ప్రకటించారు. అంతే కాకుండా బందీలను సురక్షితంగా తీసుకువచ్చిన వ్యక్తి, అతడి కుటుంబానికి సురక్షితమైన ఆశ్రయం కల్పిస్తామని వెల్లడించారు. హమాస్ పూర్తిగా నిర్మూలించిన తర్వాతే యుద్ధం ముగుస్తుందని నెతన్యాహూ స్పష్టం చేశారు.