బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ 2024-25కి సమయం ఆసన్నమైంది. ఐదు టెస్ట్ మ్యాచుల సిరీస్‌లో భాగంగా పెర్త్ వేదికగా శుక్రవారం నుంచి ఆస్ట్రేలియా, భారత్ జట్ల మధ్య తొలి టెస్టు ప్రారంభం కానుంది. ఈ టెస్టులో విజయం సాధించాలని ఇరు జట్లు బరిలోకి దిగుతున్నాయి. పెర్త్ పిచ్‌లో ఇంట్రాస్క్వాడ్ వార్మప్ మ్యాచ్ ఆడిన భారత్ ఆటగాళ్లు.. అక్కడి పరిస్థితులపై అవగాహన తెచ్చుకున్నారు. ప్రాక్టీస్ సెషన్స్‌లోనూ తీవ్రంగా సాధన చేస్తున్నారు. పెర్త్‌లో ట్రైనింగ్ సెషన్‌ను ప్రత్యక్షంగా చూసిన ఆస్ట్రేలియా మాజీ ఆటగాడు ఆడమ్ గిల్‌క్రిస్ట్.. ఆసీస్ జట్టును హెచ్చరించాడు.
న్యూజీలాండ్ టెస్టు సిరీస్ ఓటమితో డీలా పడిందనుకుంటున్న టీమిండియా మళ్లీ పుంజుకోవడం ఖాయమని ఆడమ్ గిల్‌క్రిస్ట్ తమ జట్టుకు హెచ్చరికలు జారీ చేశాడు. ఫాక్స్ క్రికెట్‌తో గిల్‌క్రిస్ట్ మాట్లాడుతూ… ‘టీమిండియా ఇప్పుడు చాలా ఉత్సాహంగా ఉంది. జట్టులోని ప్రతి ఆటగాడు విజయం కోసం తీవ్రంగా శ్రమిస్తున్నారు. పెర్త్‌లో ట్రైనింగ్ సెషన్ బాగుంది. భారత్ ఆటగాళ్లను చూస్తుంటే.. ఫుల్‌గా ఛార్జ్ అయినట్లు అనిపిస్తోంది. టెస్టు సిరీస్ కోసం పూర్తిగా సిద్దమయ్యారు. భారత్‌ను అడ్డుకోవడానికి ఆస్ట్రేలియా చాలా కష్టపడాల్సిందే’ అని చెప్పాడు.
Also Read: Amazon Offers: కళ్లు చెదిరే డిస్కౌంట్.. ఈ స్మార్ట్ టీవీపై 30 వేల తగ్గింపు!
ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్‌కు చేరడంతో పాటు ఆస్ట్రేలియా గడ్డపై బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ హ్యాట్రిక్ సాధించడమే లక్ష్యంగా భారత్ బరిలోకి దిగనుంది. విరాట్ కోహ్లీ, రిషబ్ పంత్, జస్ప్రీత్ బుమ్రా, ఆర్ అశ్విన్, ఆర్ జడేజాలు గత పర్యటనల్లో ఆడారు. పుజారా, రహానేలు లేకపోవడం కాస్త లోటే అయినా.. జురెల్, సర్ఫరాజ్, గిల్, యశస్విలు సత్తాచాటేందుకు సిద్ధమయ్యారు. కుర్రాళ్లు ఎలా ఆడతారో చూడాలి.