పొట్ట చేతపట్టుకుని ఉపాధి కోసం ఎడారి దేశం దుబాయ్ కి వెళ్లి అష్టకష్టాలు పడిన వారు చాలామందే ఉన్నారు. ఏజెంట్ ల చేతుల్లో మోసపోయి స్వదేశం తిరిగిరాలేక నానా అవస్థలు పడ్డవారు కూడా ఉన్నారు. ఇలాగా ఓ వ్యక్తి దుబాయ్ కు వెళ్లి అక్కడే చిక్కుకుపోయాడు. అనారోగ్యానికి గురైన అతడు తనను స్వదేశానికి తిరిగి తీసుకురావాలని సెల్ఫీ వీడియోలో మంత్రిని వేడుకున్నాడు. దీనికి స్పందించిన రాష్ట్ర రవాణా, బిసి సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గల్ఫ్ భాదితుడిని స్వదేశానికి చేర్చాడు.
Also Read:Pakistan: పాకిస్తాన్‌ని ఎగతాళి చేస్తున్న సొంత ప్రజలు.. కామెంట్స్ చూస్తే నవ్వాపుకోలేరు..
రాష్ట్ర రవాణా, బిసి సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ చొరవతో గల్ఫ్ బాధితుడు చొప్పరి లింగయ్య దుబాయ్ నుంచి హైదరాబాద్ కు చేరుకున్నాడు. గత వారం రోజుల క్రితం గల్ఫ్ లో అనారోగ్యంతో బాధపడుతూ స్వదేశానికి రప్పించాలని సెల్ఫీ వీడియోలో మంత్రిని వేడుకున్నాడు లింగయ్య. లింగయ్య విజ్ఞప్తికి మంత్రి స్పందించారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ కు చెందిన లింగయ్యను టికెట్ డబ్బులు వెచ్చించి స్వదేశానికి క్షేమంగా రప్పించారు. హైదరాబాద్ కు చేరుకున్న లింగయ్య హుస్నాబాద్ కు బయలుదేరారు. స్వదేశానికి తిరిగి రప్పించిన మంత్రికి లింగయ్య భార్య, కుటుంబ సభ్యులు ధన్యవాదాలు తెలిపారు.