Pakistan: జమ్మూ కాశ్మీర్ పహల్గామ్ ఉగ్రదాడిలో 26 మంది సాధారణ పౌరులు, ముఖ్యంగా మతం ఆధారంగా హిందువుల్ని లక్ష్యంగా చేయడం పట్ల యావత్ దేశం తీవ్ర ఆగ్రహంతో రగిలిపోతోంది. ఈ మేరకు పాకిస్తాన్‌పై తీవ్ర ప్రతీకారం తీర్చుకోవాలని కేంద్రాన్ని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. దీనికి తగ్గట్లుగానే, భారత్ ఇప్పటికే దౌత్యయుద్ధాన్ని మొదలుపెట్టింది. సింధు జలాల ఒప్పందాన్ని భారత్ రద్దు చేసి, పాకిస్తాన్‌కి భారీ షాక్ ఇచ్చింది. ఇక పాక్ జాతీయులకు వీసాలను రద్దు చేసింది. మరోవైపు, పాకిస్తాన్ కూడా భారత్‌పై ప్రతీకా చర్యలకు పాల్పడుతోంది. ‘‘సిమ్లా ఒప్పందం’’ రద్దుతో పాటు పాక్ ఎయిర్ స్పేస్‌ని భారత విమానాలకు మూసేసింది.
ఇదిలా ఉంటే, రెండు దేశాల మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. పాకిస్తాన్ తన బలగాలను భారత సరిహద్దు వైపు మోహరిస్తోంది. అనేక యుద్ధ విన్యాసాలు చేస్తోంది. భారత్ దాడిని తట్టుకునేందుకు అన్ని పథకాలను రచిస్తోంది. అయితే, పాకిస్తాన్ సత్తాపై పాక్ ప్రజలకే నమ్మకం లేకుండా పోయింది. పాకిస్తాన్ ప్రభుత్వాన్ని సోషల్ మీడియాలో అక్కడి నెటిజన్లు ఏకి పారేస్తున్నారు. సోషల్ మీడియా వ్యాప్తంగా షహబాజ్ షరీఫ్ ప్రభుత్వాన్ని ఎగతాళి చేస్తూ పోస్టులు పెడుతున్నారు.
Read Also: Kasthuri : రాత్రి 9 దాటిందంటే చాలు దానిపై మనసు లాగేస్తోంది..
పాకిస్తాన్ తన ప్రజలకు ప్రాథమిక సౌకర్యాలను అందించడంలో ఎలా విఫలమైందో పాక్ ప్రజలు సెటైరికల్ పోస్టులతో ఎత్తి చూపారు. ఒక యూజర్ ఎక్స్‌లో ‘‘ భారతీయులు పాకిస్తాన్‌తో యుద్ధం కోరుకుంటే గంటల్లోపే దాన్ని ముగించాలి’’ అని సూచించాడు. ఎందుకంటే ఆ తర్వాత గ్యాస్ సరఫరా ఆగిపోతుందని అంటూ సొంత దేశాన్ని ఎగతాళి చేశాడు. మరో యూజర్ వ్యంగ్యంగా, ‘‘ వారికి మరిన్ని కుంటి సాకులు ఇవ్వకండి. గోధుమ పిండి, నీరు, భిక్షం, ఇప్పుడు గ్యాస్.’’ అని పాక్ దరిద్రాన్ని ఒక పోస్టులో చెప్పాడు. మరో నెటిజన్‘‘ వారు ఒక పేద దేశంతో పోరాడుతున్నారని వారికి తెలియాలి’’ అని దేశ ఆర్థిక పరిస్థితిని ఎత్తిచూపాడు.
ఒక పాకిస్థానీ నెటిజన్ పాక్ వైమానిక దళాన్ని ట్రోల్ చేస్తూ, ఒక పాపులర్ మీమ్‌ని షేర్ చేశాడు. ఫైటర్ జెట్ లాగా కనిపించే ఒక పేపర్ ఫైటర్ జెట్ ఆకారాన్ని మోటార్ సైకిల్‌కి అమర్చి నడుపుతున్న మీమ్ హల్చల్ చేస్తుంది. సింధు నది నీటిని భారత్ ఆపాలని నిర్ణయించడంపై ఒక పాకిస్తాన్ యూజర్ ధ్వజమెత్తాడు. ‘నీటిని ఆపాలనుకుంటున్నారా..? ఏమైనప్పటికీ నీటి సరఫరా లేదు. మమ్మల్ని చంపాలనుకుంటున్నారా..? మా ప్రభుత్వం ఇప్పటికే మమ్మల్ని చంపుతోంది. మీరు లాహోర్‌ని తీసుకోవాలనుకున్నారా..? అరగంటలోనే దాన్ని మీరు తిరిగి ఇస్తారు’’ అని ఆ దేశ దరిద్రంపై సెటైర్లు వేశాడు.