Matrimonial Sites: గుజరాత్‌కి చెందిన 26 ఏళ్ల యువకుడిని వసాయి ఈస్ట్‌లోని వాలివ్ పోలీస్ బుధవారం అరెస్ట్ చేసారు. అతను మ్యాట్రిమోనియల్ వెబ్‌సైట్‌ల ద్వారా పరిచయం అయిన 15కి పైగా మహిళలను గత రెండున్నర సంవత్సరాలుగా పెళ్లి పేరుతో మోసం చేసి లైంగికంగా, ఆర్థికంగా దోచుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, అహ్మదాబాద్‌కు చెందిన హిమాంషు యోగేశ్‌భాయ్ పంచాల్ అనే వ్యక్తి మ్యాట్రిమోనియల్ వెబ్‌సైట్‌లలో తనను ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్ సైబర్ సెక్యూరిటీ డివిజన్‌లో ఉన్న అధికారి అని పేర్కొంటూ నకిలీ ప్రొఫైల్ సృష్టించాడు. అంతేకాకుండా, తాను ధనిక కుటుంబానికి చెందినవాడనని.. అనేక ఆస్తులకు యజమానిని అని కూడా పేర్కొన్నాడు.
హిమాంషు మొదట మహిళలతో పరిచయం ఏర్పరచుకొని.. వారిని ముంబై, వసాయి, అహ్మదాబాద్‌లోని హోటళ్లకు ఆహ్వానించేవాడు. అక్కడ వారికి పెళ్లి మాటలు చెప్పి నకిలీ డైమండ్ ఆభరణాలు బహుమతిగా ఇచ్చి, మొదటి భేటీలోనే శారీరక సంబంధం కోసం ఒత్తిడి చేసేవాడు. అంతేకాదు అనంతరం అత్యవసరమైన ఖర్చుల పేరుతో డబ్బులు వసూలు చేసి, చివరికి వారిని పూర్తిగా వదిలేయడం అతని వ్యూహంగా ఉండేది. ఇలా మోసాలను చేస్తూ ఇంత కాలం దొరకని హిమాంషు చివరకు పోలీసుల చేతికి చిక్కాడు. మిరా రోడ్‌కు చెందిన 31 ఏళ్ల మహిళ ఫిబ్రవరి 6న వాలివ్ పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేయడంతో అతని మోసపూరిత వ్యవహారం వెలుగు చూసింది. తనను మ్యాట్రిమోనియల్ వెబ్‌సైట్‌లో పరిచయం చేసుకుని పెళ్లి మాటలు చెప్పి నమ్మించాడని, నకిలీ డైమండ్ నెక్లెస్ బహుమతిగా ఇచ్చి తనపై లైంగిక దాడికి పాల్పడ్డాడని బాధితురాలు ఆరోపించింది.
ఈ కేసుకు సంబంధించి వాలివ్ పోలీస్ స్టేషన్ అసిస్టెంట్ ఇన్స్పెక్టర్ సచిన్ సనాప్ తెలిపిన వివరాల ప్రకారం.. హిమాంషు మంచిగా ఇంగ్లీష్ మాట్లాడే వాడు. అలా తన మాటలతో మహిళలను ఆకర్షించేవాడు. అతని వద్ద ఐదు మొబైల్ ఫోన్లు, ఒక ఆపిల్ ల్యాప్‌టాప్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఫోన్ కాల్స్ చేయడానికి హోటల్ వైఫై, వాట్సాప్ మాత్రమే ఉపయోగించేవాడు. టెక్నికల్ ఇన్వెస్టిగేషన్ ఆధారంగా పోలీసులు అహ్మదాబాద్‌లో అతన్ని అదుపులోకి తీసుకున్నారు. సాధారణ ప్రజలు ఇటువంటి మోసగాళ్లను గుర్తించి, అప్రమత్తంగా ఉండాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు.