BJP Worker: గుజరాత్‌లోని వల్సాద్ జిల్లాలోని వాపి పట్టణానికి సమీపంలో ఉన్న ఆలయం నుండి తన భార్య తిరిగి వచ్చేందుకు ఎస్‌యూవీ వాహనంలో వేచి ఉన్న స్థానిక బీజేపీ కార్యకర్తను గుర్తు తెలియని వ్యక్తులు సోమవారం ఉదయం కాల్చి చంపారని పోలీసులు తెలిపారు. మోటర్‌బైక్‌పై వచ్చిన దుండగులు కొచర్వా గ్రామంలోని శైలేష్ పటేల్ ఎస్‌యూవీ సమీపంలోకి వచ్చి అతనిపై మూడు-నాలుగు రౌండ్లు కాల్పులు జరిపారని దుంగరా పోలీస్ స్టేషన్ అధికారి తెలిపారు. శైలేష్ పటేల్ బీజేపీ వాపి తాలూకా యూనిట్ వైస్ ప్రెసిడెంట్ అని.. తాలుకా బీజేపీ అధ్యక్షుడు సురేష్ పటేల్ విచారం వ్యక్తం చేస్తూ చెప్పారు. ఆ వ్యక్తి తన భార్యతో కలిసి ప్రార్థనలు చేసేందుకు ఆలయానికి వెళ్లాడని సురేష్ పటేల్ తెలిపారు. ప్రార్థన ముగించుకుని బయటకు వచ్చి భార్య కోసం తన ఎస్‌యూవీలో వేచి ఉన్నాడు. రెండు మోటర్‌బైక్‌లపై నలుగురు దుండగులు సంఘటనా స్థలానికి వచ్చినట్లు కూడా ఆయన పేర్కొన్నారు.
Read Also: Pakistan: జైలులో ఉన్న 199 మంది భారత మత్స్యకారులను విడుదల చేయనున్న పాక్
ఉదయం 7.30 గంటల ప్రాంతంలో పటేల్ ఆలయంలో ప్రార్థనలు చేసి తిరిగి వచ్చేందుకు భార్య కోసం వాహనంలో వేచి ఉండగా ఈ ఘటన జరిగిందని పోలీసులు తెలిపారు.పటేల్ భార్య తుపాకీ శబ్దం విని వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుంది. అప్పటికే శైలేష్ పటేల్ రక్తపు మడుగులో పడి ఉండడంతో సహాయం కోసం అక్కడి వారిని పిలిచింది. శైలేష్ పటేల్‌ను వాపిలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు, అక్కడ వైద్యులు అతను చనిపోయినట్లు ప్రకటించారని అధికారి తెలిపారు.శైలేష్ పటేల్ మృతితో స్థానిక బీజేపీ నాయకులు తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ఈ సంఘటనపై విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.ఆ ప్రాంతంలోని సీసీటీవీ ఫుటేజీని పరిశీలిస్తున్నామని, అనుమానితులను ప్రశ్నిస్తున్నామని పోలీసులు తెలిపారు. ఆ ప్రాంతంలోని కొన్ని రహదారులను బ్లాక్ చేసి, దుండగుల కోసం బృందాలను ఏర్పాటు చేసినట్లు పోలీసులు తెలిపారు.