Andhrapradesh: ఏపీలో అంగన్‌వాడీ కార్యకర్తలు సమ్మెకు దిగిన సంగతి తెలిసిందే. అంగన్‌వాడీ కార్యకర్తలు సమ్మెకు దిగిన నేపథ్యంలో అమరావతిలోని సచివాలయంలో అంగన్వాడీ సంఘాలతో ప్రభుత్వం చర్చలు జరిపింది. ప్రభుత్వంతో అంగన్వాడీ యూనియన్ల చర్చలు విఫలమయ్యాయి. అంగన్వాడీ సంఘాల నేతలతో మంత్రులు బుగ్గన రాజేంద్రనాథ్, బొత్స సత్యనారాయణ, ప్రధాన సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి చర్చలు జరిపారు. జీతాలు పెంచేది లేదని ప్రభుత్వం తేల్చి లేదని చెప్పడంతో అంగన్‌వాడీలు సమ్మె కొనసాగించాలని నిర్ణయించారు. వేతనాలు పెంచాలని, గ్రాట్యుటీ అమలు చేయాలని తదితర 11 డిమాండ్లతో అంగన్‌వాడీ కార్యకర్తలు నాలుగు రోజులుగా సమ్మె చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సమ్మె విరమించాలని ప్రభుత్వం పలు దఫాలుగా చర్చలు జరిపింది. అంగన్‌వాడీ కార్యకర్తలు విధులకు హాజరుకాకపోతే ఉద్యోగం నుంచి తొలగిస్తామని సర్కారు ఇప్పటికే హెచ్చరించింది.
Read Also: AP High Court: ఎస్సై పోస్టుల నియామకం కేసు.. పిటిషనర్లపై ఏపీ హైకోర్టు తీవ్ర ఆగ్రహం
చర్చల అనంతరం మంత్రి బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ.. అంగన్‌వాడీలో చర్చలు సఫలం అవుతాయని, వారు సమ్మె విరమిస్తారని ఆశిస్తున్నట్లు చెప్పారు. వారి 11 డిమాండ్లపై చర్చలు జరిపామని, కొన్ని డిమాండ్లను అంగీకరించామని వెల్లడించారు. ఇంకొన్ని డిమాండ్లను ముఖ్యమంత్రి జగన్ దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం అయ్యేలా చూస్తామన్నారు. అంగన్‌వాడీ కేంద్రాలను స్వాధీనం చేసుకోమని సర్కారు ఆదేశం ఇవ్వలేదని బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు. కొన్ని చోట్ల అంగన్వాడీ కేంద్రాల తాళాలు పగులకొట్టి ఉండొచ్చని.. దాన్ని పట్టించుకోవాల్సిన అవసరం లేదని ఆయన వ్యాఖ్యానించారు.